అదానీ పోర్టు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేరళలో నిరసనలు భగ్గుమన్నాయి. విళింజం ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు ఆదివారం రాత్రి ఆందోళన చేపట్టారు. ఓ పోలీస్ స్టేషన్‌ను, వాహనాలను నిరసనకారులు ధ్వంసం చేశారు. హింసాత్మక ఆందోళనలో సుమారు 40 మంది పోలీసులు గాయపడ్డారు. 3వేల మంది గుర్తుతెలియని వ్యక్తులు ఆందోళనల్లో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. ఆర్చ్‌బిషప్ థామస్ జె నెట్టో, వికార్ జనరల్ యుజీన్ పెరీరా సహా 15 మంది లాటిన్ క్యాథలిక్ చర్చి ఫాదర్లపై కేసు నమోదు చేసుకున్నారు. నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిరసనకారుల్లో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నారని సమాచారం.
"సాయంత్రం 6 గంటలకు నిరసనకారులు ఇనుప రాడ్లు, కర్రలు, ఇటుకలతో పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు. పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి.. శనివారం నాటి కేసులో అరెస్టైన ఓ వ్యక్తిని, మరో నలుగురు అనుమానితులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే స్టేషన్‌కు నిప్పు పెడతామని బెదిరించారు. ఐదు పోలీసు వాహనాలను, కార్యాలయంలోని సామగ్రిని ధ్వంసం చేశారు. దాదాపు రూ.85లక్షల నష్టం వాటిల్లింది."
-పోలీసుల ఎఫ్ఐఆర్
వివాదం ఏంటంటే?
విళింజం ప్రాంతంలో అదానీ కంపెనీ.. 'విళింజం అంతర్జాతీయ పోర్టు' నిర్మాణం చేపట్టింది. రూ.7,500 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టుపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లాటిన్ క్యాథలిక్ చర్చిల ఆధ్వర్యంలో దీనికి వ్యతిరేకంగా ఆందోళన జరుగుతోంది. ఏడు డిమాండ్లను పరిష్కరించాలంటూ వీరు ఆందోళన చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల మత్స్యకారులకు అన్యాయం జరుగుతుందని వాదిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల తీరప్రాంతం కోతకు గురవుతుందని, అందువల్ల ఈ నిర్మాణాన్ని ఆపేయాలని కోరుతున్నారు. తాత్కాలిక నిర్వాసితులకు ఆవాసం, భూములు కోల్పోయినవారికి శాశ్వత పునరావాసం కల్పించాలని అడుగుతున్నారు. కిరోసిన్ ధరల పెంపును అరికట్టి.. మత్స్యకారులకు అందుబాటుల ధరలో సరఫరా చేయాలని కోరుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సీరియస్
ఈ క్రమంలోనే ఆదివారం భీకర నిరసనలు జరిగాయి. వేలాది మంది ఆందోళన కారులు పోలీసు స్టేషన్‌పైకి దూసుకెళ్లారు. నిరసనలపై స్పందించిన కేరళ వామపక్ష ప్రభుత్వం.. ఇది ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం నిర్మిస్తున్న పోర్టు వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని పేర్కొంది. కేరళ వంటి లౌకిక రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరిగేందుకు తాము అనుమతించమని తేల్చి చెప్పింది.