Adani Bridge Stolen : గుట్టుచప్పుడు కాకుండా 90 అడుగుల పొడవైన, 6,000 కేజీల ఇనుప వంతెన మాయం చేశారు దుండగులు. నిత్యం రద్దీగా ఉండే ముంబయిలోని మలాడ్ ప్రాంతం నుంచి ఇది కనిపించకుండా పోయింది. అది అదానీ ఎలక్ట్రిసిటీ సంస్థకు చెందిన వంతెన అని పోలీసులు తేల్చారు. ఈ చోరీ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తుల్ని అరెస్టు చేసినట్లు తెలిపారు.
ప్రముఖ వ్యాపార సంస్థ అదానీకి చెందిన భారీ ఎలక్ట్రిక్ కేబుళ్లను తరలించేందుకు గతేడాది జూన్‌లో మలాడ్ ప్రాంతంలోని ఓ కాలువపై ఈ తాత్కాలిక ఇనుప వంతెనను ఆ కంపెనీ ఏర్పాటు చేసింది. అయితే తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆ కాలువపై మరో వంతెనను నిర్మించారు. దాంతో ఆ పాత ఇనుప వంతెనను వినియోగించట్లేదు. కొద్దిరోజుల క్రితం 6,000 కేజీల బరువున్న ఆ వంతెన కనిపించకుండా పోయింది. రద్దీ ఉండే ప్రాంతం నుంచి అది అదృశ్యం కావడం వల్ల అందరూ ఆశ్చర్యపోయారు. దీనిపై అదానీ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అధికారులు దర్యాప్తు చేపట్టారు. దొంగతనం జరిగిన తీరును తెలుసుకున్న అధికారులు విస్తుపోయారు.
గ్యాస్ కట్టర్లతో వంతెనను ముక్కలుగా చేసి.. ఒక భారీ వాహనంలో దానిని తరలించిట్లు గుర్తించారు అధికారులు. ఈ కేసులో పోలీసులు నలుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. అందులో ఒకరికి ఈ వంతెన ఏర్పాటుతో కూడా సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడు ఈ వంతెన నిర్మాణం కోసం కాంట్రాక్టు పద్ధతిలో అదానీ సంస్థలో పనిచేసినట్లు పోలీసులు వెల్లడించారు. మిగిలిన ముగ్గురు అతడికి సహకరించారని వివరించారు. ఇంకా దీని వెనక ఎవరైనా ఉన్నారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.