Actress Dimple Hayathi Controversy Latest Update : ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే ప్రభుత్వ వాహనాన్ని ఢీకొట్టిన కేసులో నటి డింపుల్ హయాతిపై కేసు నమోదైన వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. పోలీస్ అధికారి విధులకు ఆటంకం కలిగించడం, ప్రభుత్వ వాహనాన్ని ఢీకొట్టడంతో పోలీసులు ఆమెను స్టేషన్‌కు పిలిపించి విచారించిన సంగతి తెలిసిందే. అయితే.. డింపుల్‌పై తప్పుడు కేసు పెట్టారని.. ఈ విషయంలో చట్టపరంగా పోరాడతామని ఆమె తరఫు న్యాయవాది పాల్ సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే డింపుల్‌కు ప్రాణహాని ఉందని.. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఆమెకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆరోపించారు.
Fans enters into Dimple Hayathi Home : ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు డింపుల్ ఇంట్లోకి ప్రవేశించడం కలకలం రేపింది. ఘటనకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం డింపుల్ హయాతి ఇంట్లోకి ఓ యువతి, యువకుడు ప్రవేశించారు. ఉదయం అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన ఆ ఇద్దరు.. నేరుగా సీ2లో ఉండే డింపుల్ నివాసంలోకి వెళ్లారు. పని మనిషి వారిని ఎవరని ఆరా తీసే ప్రయత్నం చేస్తుండగా.. అంతలోనే ఇంట్లో ఉన్న కుక్క వారి వద్దకు వెళ్లడంతో భయపడి తిరిగి లిఫ్టులోకి వెళ్లారు. వారిని వెంబడిస్తూ లిఫ్టు లోపలికి వెళ్లిన కుక్క.. వెంటనే తిరిగి బయటకు వచ్చేసింది.
డింపుల్‌ను కలవడానికి వచ్చాం.. : విషయం తెలుసుకున్న డింపుల్ హయాతి తక్షణమే డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని యువతి, యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువతీయువకుడు కొప్పిశెట్టి సాయి బాబు, అతని బంధువు శ్రుతిగా గుర్తించి స్టేషన్‌కు తరలించారు. ఆ ఇద్దరిని విచారించగా.. తాము డింపుల్ హయాతి అభిమానులమని.. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి నుంచి వచ్చామని తెలిపారు. తాజా ఘటన నేపథ్యంలో ఆమెను ఓసారి కలవడానికి వచ్చినట్లు వివరించారు. పోలీసులు ఈ విషయాన్ని డింపుల్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆమె వారిద్దరిని విడిచి పెట్టమని చెప్పారు. దాంతో వారిద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చి ఠాణా నుంచి పంపించేశారు.