Actress Dimple Hayathi Controversy : ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే ప్రభుత్వ వాహనాన్ని ఢీకొట్టిన కేసులో నటి డింపుల్ హయాతిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. డింపుల్ ఉద్దేశపూర్వకంగానే అలా వ్యవహరించారని డీసీపీ ఆరోపించగా.. అధికారాన్ని ఉపయోగించినా తప్పు దాగదు అంటూ హీరోయిన్ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
Actress Dimple Hayathi Vs IPS Officer :జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని హుడా ఎంక్లేవ్‌లో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్‌మెంట్‌లో నటి డింపుల్ హయాతి, డేవిడ్ ఉంటున్నారు. ట్రాఫిక్ డీసీపీకి చెందిన ప్రభుత్వ వాహనాన్ని ఆయనకు డ్రైవర్‌గా ఉన్న కానిస్టేబుల్ చేతన్ కుమార్ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో పార్కింగ్ చేస్తున్నారు. ఆయన వాహనం పక్కనే నటి డింపుల్ హయాతి, డేవిడ్‌లు తమ వాహనాన్ని పార్కింగ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రతి రోజు డీసీపీ వాహనానికి ఉన్న కవర్‌ను తొలగించడం, వాహనానికి అడ్డుగా పెట్టిన కోన్‌లను కాలితో తన్నడం వంటి పనులు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈ నెల 14న డింపుల్ హయాతి తన వాహనంతో డీసీపీ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో పార్కింగ్ చేసి ఉన్న డీసీపీ కారు ముందు భాగం దెబ్బతింది. సీసీ ఫుటేజీ ద్వారా కారణాన్ని తెలుసుకున్న డ్రైవర్ చేతన్ కుమార్.. జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు డింపుల్, డేవిడ్‌లపై 353, 341, 279 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
''డింపుల్ హయాతి, నేను ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాం. సెల్లార్‌లో నా కారుకు అడ్డంగా ఆమె కారు పెడుతోంది. నేను అత్యవసరంగా వెళ్లేటప్పుడు నాకు ఇబ్బంది అవుతోంది. ఈ విషయంలో వ్యక్తిగతంగా వెళ్లి డింపుల్ హయాతిని రిక్వెస్ట్ చేశాను. సెల్లార్‌లో నా కారును ఢీ కొట్టి, కాలితో తన్నారు. ప్రభుత్వ కారును ధ్వంసం చేసినందుకు మా డ్రైవర్ ఫిర్యాదు చేశాడు. నేను అధికారం అడ్డం పెట్టుకొని తప్పు కప్పిపుచ్చినట్లు డింపుల్ ట్వీట్ చేశారు. డింపుల్ ఆరోపణలపై వాస్తవం దర్యాప్తులో బయట పడుతుంది.'' - రాహుల్ హెగ్డే, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ