Actor Vijay Political Entry : సినిమా నటులు.. రాజకీయ నాయకులుగా మారడం కొత్తేమీ కాదు. తమిళనాడులో అయితే.. ఇది చాలా సర్వ సాధారణ విషయం. ఆనాడు కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత నుంచి మొదలుకుంటే నేటి కమల్ హాసన్ వరకు అనేక మంది నటులు.. రంగుల ప్రపంచాన్ని పక్కన పెట్టి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ నేపథ్యంలోనే వీరిని అనుసరిస్తూ మరో నటుడు, తమిళ స్టార్ హీరో 'దళపతి' విజయ్ కూడా రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈమధ్య కాలంలో ఆయన చేసే కార్యక్రమాలు కూడా వీటికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇటీవలె తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాల వారీగా టెన్త్, ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమాలతో పాటు అభిమానులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఖాయమనే అనిపిస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇటీవల హీరో విజయ్ తన అభిమాన సంఘం 'విజయ్ మక్కళ్ ఇయక్కం' (VMI) సభ్యులతో తరచూ భేటీ అవుతున్నారు. తాజాగా మంగళవారం కూడా వారితో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలకు చెందిన సభ్యులతో పనైయూర్‌లోని ఫామ్‌హౌస్‌లో సమావేశమయ్యారు. 2026లో జరిగే ఎన్నికలకు ఎలా సన్నద్ధం అవ్వాలన్న అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న విజయ్.. అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తోంది. ఇందుకోసం రెండు సంవత్సరాలు సినిమాలకు విరామం ప్రకటించి.. పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి సారించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
పాదయాత్రకు సన్నద్ధత!
మరోవైపు కొన్ని రోజుల్లో పాదయాత్ర కూడా చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన నటించిన తాజా చిత్రం 'లియో' విడుదల కంటే ముందే తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలనుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. లియో చిత్రం అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈలోపు విజయ్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం.