రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగా కేరళలోని ఎర్నాకుళంలో సోమవారం కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఫలితంగా ఆ ప్రాంతంలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. నటుడు జోజు జార్జ్.. ట్రాఫిక్‌లో రెండు గంటల పాటు చిక్కుకున్నారు. దీంతో సహనం కోల్పోయిన ఆయన కారు దిగి కాంగ్రెస్ శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. సాధారణ పౌరులకు కష్టాలు తెచ్చిపెట్టే విధంగా నిరసనలు తెలపడం తగదని వారించారు. దీంతో ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ కార్యకర్తలు.. జోజు కారు అద్దాన్ని పగలగొట్టారు.
'ఇంధన ధరలు పెంపు అనేది చాలా పెద్ద విషయం. అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ అంశంపై నిరసన తెలపాలి. కానీ ఈ విధంగా కాదు. ప్రజలకు కష్టమవుతోంది. ఆసుపత్రికి వెళ్లాల్సిన వారు ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయారు,' అని జోజు భావోద్వేగంతో మీడియా ముందు మాట్లాడారు.