ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టే ధోరణికి భిన్నంగా ఇద్దరు సామాజిక కార్యకర్తలు తొలిసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చేతిలో ఎలాంటి డబ్బు లేకుండానే అఖిల్ గొగొయ్ బరిలోకి దిగుతుండగా, రూ.10వేలతో ప్రణబ్ డోలే పోటీకి సిద్ధమయ్యారు. అసోంలో శనివారం జరగనున్న తొలిదశ ఎన్నికలలో గొగొయ్.. శివసాగర్ నియోజకవర్గం నుంచి, డోలే.. బోకాఖత్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు.
అఖిల్ గొగొయ్..
క్రిషక్ ముక్తి సంగ్రామ్ సమితికి సలహాదారుగా ఉన్న అఖిల్ గొగొయ్ ఇటీవల రాయ్జోర్ దళ్ పేరుతో పార్టీని స్థాపించారు. తన వద్ద రెండు బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.60,497 ఉన్నాయని ఎన్నికల సంఘానికి నివేదించారు గొగొయ్. కాజీరంగ జాతీయ పార్కుకు సమీపంలో ఉన్న ఆర్చిడ్ పార్క్‌కు సంబంధించి రూ.10వేలు విలువ చేసే షేర్లు ఉన్నాయని ప్రకటించారు. తనకు ప్రస్తుతం ఎలాంటి ఆదాయం లేదని.. భార్య గీతశ్రీ తమూలే వద్ద రూ.50వేలు అప్పు తీసుకున్నానని తెలిపారు. గువాహటిలోని బొరూవా కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన భార్య పేరున రూ.1.66 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నాయని సమాచారం.