కూచ్‌బిహార్ జిల్లాలో కాల్పుల ఘటనపై చర్య తీసుకోవాలని బంగాల్ (West Bengal) డీజీపీకి సూచించింది జాతీయ మానవ హక్కుల సంఘం(NHRC). బంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ సమయంలో సీతల్‌కూచి ప్రాంతంలో కేంద్ర భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు.
సుప్రీం కోర్టు న్యాయవాది, సామాజిక కార్యకర్త రాధాకాంత త్రిపాఠి.. పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది.
కాల్పుల ఘటనపై 2021, ఏప్రిల్ 10న పిటిషన్ దాఖలు చేశారు త్రిపాఠి. పోలింగ్ సమయంలో.. భాజపా నేతలు 50-60 మంది ఓటర్లను సీఆర్పీఎఫ్ బలగాల సాయంతో పోలింగ్ బూత్‌కు తీసుకెళ్లినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. పోలింగ్ నేపథ్యంలో 14 ఏళ్ల బాలుడిని సీఆర్పీఎఫ్ బలగాలు తీవ్రంగా కొట్టాయని తెలిపారు. ఈ ఘటనను మొబైల్లో చిత్రీకరించిన బాధితుడి సోదరుడిని కూడా బలగాలు హింసించినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులకు, భద్రతా బలగాలకు ఘర్షణ చెలరేగిందని తెలిపారు.