తను ప్రేమించిన అమ్మాయికి మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయమవటాన్ని తట్టుకోలేని ఓ యువకుడు కిరాతక చర్యకు పాల్పడ్డాడు. ఇంటి ముందు నిద్రిస్తున్న బాలికపై యాసిడ్ దాడి(acid attack) చేశాడు. ఈ ఘటనలో బాలికతో పాటు ఆమె చిన్న తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాయ్‌బరేలీలో జరిగింది.
ఇదీ జరిగింది...
జిల్లాలోని సికందర్పుర్ గ్రామానికి చెందిన ఓ బాలిక(16), తన చిన్న తమ్ముడితో కలిసి ఆదివారం రాత్రి ఇంటి ముందు మంచంపై నిద్రిస్తోంది. అర్ధరాత్రి వారిపై యాసిడ్ దాడి జరిగింది. తీవ్ర గాయాలతో అరవగా.. కుటుంబ సభ్యులు లేచి వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం లఖ్‌నవూకు తీసుకెళ్లారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.