Acid Attack on Woman: దేశంలో మహిళలపై వేధింపులు ఎక్కువవుతున్నాయి. ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన, ఎన్ని శిక్షలు వేసిన మనుషుల తీరు మాత్రం మారడం లేదు. రోజుకో చోట అతివలపై దాడులు, అత్యాచారాలు, హత్యాయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వారి వేధింపులు తాళలేక కొద్దిమంది స్త్రీలు పోలీసులను, చట్టాలను ఆశ్రయిస్తే.. మరికొంతమంది బయట పడలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాగే మరోవైపు యాసిడ్ దాడులు కూడా ఎక్కువవతున్నాయి. ప్రేమను నిరాకరించారని, పెళ్లికి ఒప్పుకోలేదని, ఇంకా ఏవో కారణాల వల్ల చాలా మంది యాసిడ్ దాడి చేసి వారిని కోలుకోలేని దెబ్బ తీస్తున్నారు. తాజాగా ఒంటరిగా బైక్‌పై వెళ్తున్న ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేసిన పరారైన దారుణ ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది.
ఏలూరు నగరానికి చెందిన వై.ఫ్రాన్సిక (35)అనే మహిళకు రాజమహేంద్రవరానికి చెందిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ రామాంజనేయులతో ఏడు సంవత్సరాల క్రితం వివాహం అయింది. వీరికే ఐదు సంవత్సరాల పాప కూడా ఉంది. అయితే వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా రెండు సంవత్సరాల క్రితం విడిపోయి వేరువేరుగా ఉంటున్నారు. ప్రస్తుతం ఫ్రాన్సిక ఏలూరులోని విద్యానగర్‌లో నివాసం ఉంటోంది. స్థానికంగా ఉండే దంత ఆస్పత్రుల్లో రిసెప్షనిస్ట్‌గా పని చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఆసుపత్రిలో డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు యాసిడ్‌తో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన మహిళను వెంటనే చికిత్స నిమిత్తం హుటాహుటిన ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్, ఎస్పీ మేరీ ప్రశాంతి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని నేరుగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. యాసిడ్ దాడి జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐజీ అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, దాడికి గల కారణాలు పూర్తిగా తెలియరాలేదని అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని తెలిపారు. మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడకు తరలిస్తున్నామన్నారు.