నగ్నంగా మహిళల ఊరేగింపు ఘటన.. నిందితుడి ఇల్లు దగ్ధం.. టైర్లతో కాల్చేసిన గ్రామస్థులు Manipur Woman Paraded Accused House : మణిపుర్‌లో కుకీ వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను కొందరు పురుషులు నగ్నంగా ఊరేగించి, వారిపై అత్యాచారం జరిపిన ఉదంతం యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడిగా పోలీసులు ప్రకటించిన హుయిరేమ్ హెరోదాస్ మైతేయ్ ఇంటిని కొందరు వ్యక్తులు.. తగలబెట్టేశారు. పేచీ అవాంగ్ లైకైలో ఉన్న హోరోదాస్ ఇంటిని చుట్టుముట్టిన కొందరు గ్రామస్థులు టైర్లతో కాల్చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా.. భద్రతా బలగాలు ఆ గ్రామంలో మోహరించాయి.
మణిపుర్‌లో గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి ఆపై వారిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడ్ని వీడియో ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. నగ్నంగా ఉన్న ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ కనిపించాడు హుయిరేమ్(32). అయితే అప్పటికే వీడియో వైరల్ కావడం వల్ల భయంతో కుటుంబాన్ని వేరే చోటుకు తరలించి.. తాను మాత్రం మరో చోట తలదాచుకున్నాడు. బుధవారం రాత్రి థౌబల్ జిల్లాను జల్లెడ పట్టిన పోలీసులు.. ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేసినట్లు గురువారం సాయంత్రం ప్రకటించారు. వీళ్ల ద్వారా మిగతా నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు మణిపుర్ పోలీసులు.
మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించే ముందు భారీ గుంపుగా వచ్చిన కొంతమంది.. అమాయక ప్రజలను చంపారని.. అనేక ఇళ్లను తగలబెట్టారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అలాగే ఆ బృందం.. బీ.ఫయనోమ్ గ్రామస్థుల ఇళ్లలోని నగదు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆహారధాన్యాలు ఎత్తుకెళ్లిందని ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.
ఆ రోజు ఏం జరిగింది?
మణిపుర్‌లో మే 3న రెండు తెగల మధ్య తొలుత హింస చెలరేగింది. రెండు వర్గాల దాడులతో మణిపుర్ రాజధాని ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్‌పోప్కి జిల్లా ఉలిక్కిపడింది. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన వివరాల ప్రకారం.. మైతేయ్ వర్గానికి చెందిన ఓ మహిళపై అత్యాచారం చేశారన్న ఆరోపణలపై కొందరు యువకులు కుకీ వర్గానికి చెందిన గ్రామాలపై దాడులకు ఉపక్రమించారు. ఈ క్రమంలో తమ ఊరి మీదికి కూడా మైతేయ్‌ల గుంపు దాడి చేయనుందనే సమాచారంతో.. మే 4వ తేదీన బీ.ఫయనోమ్ గ్రామానికి చెందిన కుకీ వర్గానికి చెందిన ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు సురక్షిత ప్రాంతానికి పారిపోయేందుకు సిద్ధమయ్యారు. ఇందులో ఓ 50 ఏళ్ల వ్యక్తి, అతడి కుమారుడు (19), కుమార్తె (21) ఒకే కుటుంబం కాగా.. మరో ఇద్దరు ఇతర మహిళలు ఉన్నారు.
అదే సమయంలో వారికి నాంగ్‌పోక్ సెక్మై వద్ద పోలీసులు కనిపించడం వల్ల వారి వద్దకు వెళ్లారు. అంతలోనే దాదాపు 800 నుంచి 1000 మందితో ఉన్న ఓ భారీ గుంపు.. బీ.ఫయనోమ్ గ్రామంలోకి ప్రవేశించి ఈ ఐదుగురి బృందాన్ని అడ్డగించింది. అనంతరం పోలీసుల దగ్గర ఆయుధాలు లాక్కొని దాడికి పాల్పడింది. అందులోని 19 ఏళ్ల యువకుడు తన సోదరి (21)ని రక్షించేందుకు ప్రయత్నించాడు. కానీ.. సాయుధ మూకల దాడిలో అతడితోపాటు యువతి తండ్రి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. అనంతరం.. 21 ఏళ్ల యువతితోపాటు మరో మహిళను నగ్నంగా ఊరేగిస్తూ సమీప పొలాల్లోకి తీసుకెళ్లారు. కొందరు యువకులు వారి శరీర భాగాలను చేతులతో తడుముతూ అసభ్యంగా ప్రవర్తించారు. వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి అనంతరం వదిలిపెట్టారు. ఈ మేరకు బాధిత కుటుంబాలు ఆరోపించాయి. వారి ఫిర్యాదు మేరకు మే 18న జీరో ఎఫ్‌ఐఆర్ నమోదయింది. మణిపుర్‌లో మే 3నుంచి ఇంటర్నెట్ వినియోగంపై నిషేధం ఉంది. అందుకే ఇన్ని రోజులు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు రాలేదని తెలుస్తోంది.