తెలంగాణ

telangana

ETV Bharat / bharat

15ఏళ్ల క్రితం జైలు నుంచి మాయం.. పేరు మార్చుకుని ఆయుర్వేదం బిజినెస్.. చిన్న క్లూతో చివరకు..

కర్ణాటకలో పెరోల్​పై విడుదలై తప్పించుకు తిరుగుతున్న ఓ వ్యక్తిని 15 ఏళ్ల తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి ఓ హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష పడినట్లు తెలిపారు.

accused escaped from jail in karnataka
జైలు నుంచి తప్పించుకున్న నిందితుడు

By

Published : Dec 21, 2022, 12:52 PM IST

కర్ణాటకలో పెరోల్​పై విడుదలై 15 ఏళ్లగా తప్పించుకు తిరుగుతున్న ఓ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. పెరోల్​పై విడుదలై తిరిగి రాని కేసులను దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని గుర్తించారు. ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో అతడికి జీవిత ఖైదు శిక్ష పడింది.

అసలేంటీ కేసు..?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2000 సంవత్సరంలో బెంగళూరులోని హోసూర్​ రోడ్​లో.. ఐదుగురు వ్యక్తులు కలిసి ఓ లారీ డ్రైవర్​ను హత్య చేసి దొంగతనానికి పాల్పడ్డారు. ఆ కేసును దర్యాప్తు చేసిన మడివాలా పోలీసులు సుహైల్​, శంకర్​, సలీమ్​, చాంద్​ పాషా, వేణుగోపాల్​​ అనే నిందితులను అరెస్ట్​ చేశారు. 2004లో కోర్టు వారికి జీవిత ఖైదు శిక్షను విధించింది. మూడేళ్ల శిక్షను అనుభవించిన అనంతరం.. 2007లో సుహైల్​ పెరోల్​పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత తిరిగి జైలుకు వెళ్లకుండా మహమ్మద్​ అయాజ్​గా పేరు మార్చుకొని అజ్ఞాతంలోకి వెళ్లాడు. పోలీసులు కొంతకాలం పాటు వెతికినా సరే సుహైల్ ఆచూకీ దొరకలేదు. దీంతో సుహైల్​ను వెతకడం ఆపేశారు.

అదే కేసులో శిక్ష పడిన మరో నిందితుడు శంకర్​ కూడా 2015లో పెరోల్​పై బయటకు వచ్చాడు. అనంతరం​ 2017లో శంకర్ చనిపోయాడు. అయితే శంకర్​ డబ్బుల కోసం దక్షిణ కన్నడ జిల్లాలోని బేళ్తంగడి ప్రాంతంలో ఓ వ్యక్తి వద్దకు వెళ్లేవాడని అతడి స్నేహితుడు పోలీసులకు తెలిపాడు. పోలీసులు అప్పుడు ఆ సమాచారాన్ని సరిగా పట్టించుకోలేదు.

కొన్నిరోజుల క్రితం మడివాలా పోలీసులు పెరోల్​పై విడుదలై తిరిగి రాని కేసులను దర్యాప్తు చేయడం ప్రారంభించారు. శంకర్​ స్నేహితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా చేసుకొని విచారణ చేపట్టి బేళ్తంగడి చేరుకున్నారు. అక్కడ.. ఆయుర్వేదం మందుల దుకాణం నడుపుతున్న సుహైల్​ అలియాస్​ మహమ్మద్​ అయాజ్​ను గుర్తించారు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించడం ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details