Accused Arrested in Mukesh Ambani Treat Mails Case : ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీకి బెదిరింపు మెయిల్ పంపిన కేసులో ముంబయి పోలీసులు ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. తెలంగాణకు చెందిన 19 ఏళ్ల యువకుడు గణేశ్ వన్‌పార్ది ఈ బెదిరింపు మెయిల్ పంపించినట్లు గుర్తించిన ముంబయి పోలీసులు అతడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈరోజు ముంబయిలోని లోయర్ కోర్టులో ప్రవేశపెట్టడంతో.. కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో ఒక్కరే ఉన్నారా..? ఇంకెవరి ప్రమేయమైనా ఉందా అనే వివరాలు సేకరించడానికి నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. దీంతో కోర్టు ఈ నెల 8వ తేదీ వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది.
నిందితుడికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పనిలో గడేవీ పోలీసులు నిమగ్నమయ్యారు. ముఖేశ్ అంబానీకి గత నెల 31న.. ఈ నెల 1న బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. రూ.400 కోట్లు ఇవ్వాలని.. లేకపోతే అంతం చేస్తామని మెయిల్లో హెచ్చరించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఐపీ అడ్రస్ ఆధారంగా గణేశ్ వన్‌పార్దిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణకు చెందిన వాడిగా గుర్తించి వ్యక్తిగత వివరాలు సేకరించారు. నిందితుడిని ప్రశ్నించినప్పుడు రూ.400 కోట్లు డిమాండ్ చేసినట్లు అంగీకరించాడు. దీంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సీనియర్ పోలీస్ అధికారి వివేక్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు గణేశ్.. ముఖేష్ అంబానీ మెయిల్ ఐడీ ఎలా సేకరించాడని ఆరా తీస్తున్నారు. గతంలో ఏదైనా నేర చరిత్ర ఉందా అనే వివరాలు సేకరిస్తున్నారు.
గతేడాదీ ఇలాంటి బెదిరింపులు..: గతేడాది కూడా అంబానీ కుటుంబానికి ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. 2022 ఆగస్టు 15వ తేదీన బెదిరింపు కాల్స్ చేశారు. ఓ వ్యక్తి రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న హర్‌కిసాన్‌దాస్ హస్పిటల్‌కు బెదిరింపు కాల్ చేశారు. ఆసుపత్రి పేల్చేస్తామని.. అంబానీ కుటుంబాన్ని చంపేస్తామని నిందితుడు కాల్ చేసి బెదిరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.