Accident in Vijayawada Bus Stand:విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో బస్సు బీభత్సం సృష్టించింది. ఓ ఆర్టీసీ బస్సు ప్లాట్‌ఫాంలోని ప్రయాణికులపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బస్సు చక్రాల కిందపడి పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు ప్రమాదం ప్రయాణికులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. విజయవాడ ఆటోనగర్ డిపోకు చెందిన బస్సు.. గుంటూరు వెళ్లేందుకు బస్టాండ్‌కు వచ్చింది. ఈ క్రమంలో ఉన్నట్లుండి ప్లాట్‌ఫాంలోని ప్రయాణికులపై అతివేగంతో దూసుకొచ్చింది. ఈ క్రమంలో బస్సు చక్రాల కింద పడి ముగ్గురు బలయ్యారు. మృతుల్లో ఓ మహిళతో పాటు, ఆర్టీసీ బుకింగ్ క్లర్క్, ఆరు నెలల చిన్నారి ఉన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
బ్రిడ్జ్ పైనుంచి రైల్వే ట్రాక్‌పై పడిన బస్సు- నలుగురు మృతి
బస్సు ప్రమాదం ధాటికి ప్రాంగణంలోని బారికేడ్లు, కుర్చీలు ధ్వంసమయ్యాయి. దుకాణాల్లోకి కూడా దూసుకెళ్లడంతో వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆ ప్రాంతం మొత్తం భీతావహంగా మారింది. బ్రేక్ పడకపోవడం వల్లే బస్సు ఫ్లాట్ఫాంపైకి దూసుకొచ్చిందని దుకాణదారులు చెబుతున్నారు.
"బస్సు ఎక్సలేటర్ పట్టేసింది. దాంతో నేను రివర్స్ గేర్ వేశాను. బస్సు ముందుకు పోనిద్దామని మూవ్ చేశాను. అది పట్టుకునిపోవడం వల్ల నాకు ఏం అర్థం కాలేదు. బస్సుకు ఆ సమస్య ఎప్పటినుంచో ఉందంటా.. నేను నిన్న, ఈ రోజే వచ్చాను." -ప్రమాదానికి గురైన బస్ డ్రైవర్