పూజలు చేస్తుండగా దూసుకొచ్చిన లారీ.. 8 మంది చిన్నారులు దుర్మరణం - ఏడుగురు చిన్నారుల మృతి
22:11 November 20
పూజలు చేస్తుండగా దూసుకొచ్చిన లారీ.. 8 మంది చిన్నారులు దుర్మరణం
బిహార్ వైశాలి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ లారీ జనాలపైకి దూసుకెళ్లగా.. ఎనిమిది మంది చిన్నారులు మృతి చెందారు. మరికొంత మందికి గాయాలయ్యాయి. మెహ్నర్-హాజీపూర్ ప్రధాన రహదారి పక్కన గ్రామస్థులు పూజలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదే సమయంలో అదుపుతప్పిన ఓ లారీ జనాలపైకి దూసుకొచ్చింది. ఆ జనాల గుంపులో చిన్నారులు ఎక్కువగా ఉన్నందున.. వారిలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరి కొంతమందికి తీవ్రంగా గాయాలయ్యాయి.
గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతానికి లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని.. అతడి కోసం గాలింపు చర్యలు చేపడతున్నట్లు పోలీసులు తెలిపారు.