ACB Raids: అవినీతి ఆరోపణలతో కర్ణాటకలోని పలువురు ప్రభుత్వ అధికారుల నివాసాలపై శుక్రవారం ఉదయం దాడులు నిర్వహించింది అవినీతి నిర్మూలన విభాగం(ఏసీబీ). తనిఖీల్లో భాగంగా బాగల్కోట్ ఆర్టీఓ అధికారి బంధువు ఇంట్లో రూ.42 లక్షల నగదు పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. నగదుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు. దాడులు కొనసాగుతున్నట్లు చెప్పారు.
పలువురు అధికారులకు శుక్రవారం తెల్లవారుజామునే దాడులు చేపట్టి షాక్ ఇచ్చింది ఏసీబీ. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 21 మంది అధికారులకు చెందిన 80 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో సుమారు 300 మంది ఏసీబీ అధికారులు పాల్గొన్నారు. ఉదయం ఆరు గంటల నుంచే వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈ సోదాలు చేపట్టినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఆదాయానికి మించి ఉన్న ఆస్తుల వివరాలు, పత్రాల ధ్రువీకరణ చేపట్టినట్లు చెప్పారు. బెంగళూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10 జిల్లాల్లో ఈ దాడులు చేపట్టామన్నారు. అధికారుల్లో ఆర్టీఓ, సీఐ, పీడబ్ల్యూడీ ఇంజినీర్లు, రిజిస్ట్రేషన్ అధికారులు, పంచాయతీ సెక్రటరీలు సహా పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.