తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శిర్డీ సాయి భక్తులకు గుడ్​న్యూస్.. క్యూలో ఏసీ సౌకర్యం.. రూ.109కోట్లతో ఏర్పాట్లు - ac in saibaba darshan marg

ఆహ్లాదకరమైన వాతావరణంలో శిర్డీ సాయిబాబాను దర్శించుకునేలా దేవస్థానం ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. దర్శనానికి వచ్చే భక్తుల కోసం క్యూ లైన్లలో ఏసీ సదుపాయం కల్పించాలని నిర్ణయించింది.

ac sai-darshan
ac sai-darshan

By

Published : Jan 4, 2023, 10:42 AM IST

శిర్డీకి వచ్చే భక్తులకు గుడ్​న్యూస్ చెప్పింది శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్. సాయి దర్శనం కోసం భక్తులు వేచిచూసే మార్గంలో ఏసీ సదుపాయం కల్పించనుంది. రూ.109కోట్ల వ్యయంతో భారీ కాంప్లెక్స్ నిర్మాణం సహా భక్తులకు ఉపయోగపడేలా ఇతర సౌకర్యాలు సైతం ఏర్పాటు చేస్తామని తెలిపింది. సౌకర్యవంతంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులు.. సాయి దర్శనం చేసుకొనేలా ఈ ఏర్పాట్లు ఉంటాయని పేర్కొంది.

"శిర్డీలోని ఆలయ ప్రాంగణంలో రెండు లక్షల ఏడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సాయి దర్శన కాంప్లెక్స్ నిర్మిస్తాం. రెండస్తుల్లో ఈ భవనం ఉంటుంది. ఈ దర్శన కాంప్లెక్స్​లో 12 ఏసీ గదులు ఉంటాయి. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. భద్రత కోసం 200 సీసీటీవీ కెమెరాలు అమర్చుతాం. మొత్తం రూ.109.50 కోట్లతో ఈ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తిచేస్తాం."
-రాహుల్ జాదవ్, సాయి సంస్థాన్ ట్రస్ట్ డిప్యూటీ ఎగ్జిగ్యూటివ్ అధికారి

మరోవైపు, శిర్డీ ఎయిర్​పోర్ట్​లో ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త టెర్మినల్ భవనాన్ని నిర్మించనున్నట్లు మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి రాధాకృష్ణ పాటిల్ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్​లో పనులు ప్రారంభిస్తామని.. వచ్చే ఏడాది మే నాటికి టెర్మినల్ భవన నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. కొత్త టెర్మినల్ భవనం కోసం రూ.350 కోట్లను ప్రభుత్వం కేటాయించిందని శిర్డీ విమానాశ్రయ నిర్వహణ సంస్థ 'మహారాష్ట్ర ఎయిర్​పోర్ట్ డెవలప్​మెంట్ కంపెనీ' తెలిపింది. పనులను పూర్తి చేయాలని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఆదేశాలు జారీ చేశారని పేర్కొంది.

రాత్రిపూట ల్యాండింగ్​ కోసం..
శిర్డీ విమానాశ్రయాన్ని 2017లో ప్రారంభించారు. అయితే, ఇక్కడ రాత్రివేళ విమాన రాకపోకలకు అవసరమైన ఏర్పాట్లు లేవు. తాజా టెర్మినల్​ నిర్మాణంతో రాత్రిపూట విమానాలు ల్యాండ్ అయ్యేందుకు మార్గం సుగమమవుతుందని అధికారులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details