Abundance In Millets Modi Song : తృణధాన్యాల ప్రయోజనాల గురించి ప్రచారం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో అమెరికన్ గాయకురాలు ఫాలూ రూపొందించిన పాట అరుదైన ఘనత సొంతం చేసుకుంది. గ్రామీ అవార్డుల్లో ప్రపంచంలోనే ఉత్తమ సంగీత ప్రదర్శన విభాగానికి ఈ పాట నామినేట్ అయినట్లు నిర్వాహకులు శుక్రవారం వెల్లడించారు. 'అబండెన్స్ ఇన్ మిల్లెట్స్' అనే ఈ పాటను ముంబయిలో జన్మించిన ఫాల్గుణి షా రాసి ఆలపించారు. ఈమె ఫాలూగా ప్రసిద్ధి చెందారు. గాయకుడైన ఆమె భర్త గౌరవ్ షా కూడా ఈ పాటలో భాగం పంచుకున్నారు. ఆయన సైతం ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు.
Abundance in Millets Grammy : 'అబండెన్స్ ఇన్ మిల్లెట్స్' అనే పాటను ఈ ఏడాది జూన్‌లో అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం వేడుకల్లో విడుదల చేశారు. ఈ పాట రచయిత ఫాలూ ఇప్పటికే 'కలర్‌ఫుల్ వరల్డ్' అనే పాటకు 2022 చిన్నారుల ఆల్బమ్ విభాగంలో గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. ఈ అవార్డు గెలుచుకున్న అనంతరం భారత్‌కు వచ్చిన ఆమె.. మోదీని కలిసి మిల్లెట్స్‌పై పాట రాయాలనే ఆలోచన ఉందని చెప్పారు. దీనిపై స్పందించిన మోదీ.. మనుషుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు సంగీతానికి బలమైన శక్తి ఉందని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆకలి నిర్మూలన కోసం ఒక పాట రాయాలని ఫాల్గుణి షా దంపతులకు సూచించారట. ఆయన్ను కూడా పాటలో భాగమవ్వాలని కోరగా సానుకూలంగా స్పందించడం వల్ల పాట రూపుదిద్దుకుంది. 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి. భారత్ చేసిన ఈ ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితిలోని ఆహార, వ్యవసాయం సంస్థతో పాటు జనరల్ అసెంబ్లీ ఆమోదించింది.