తెలంగాణ

telangana

ETV Bharat / bharat

assembly election 2022: నాలుగు రాష్ట్రాల్లో భాజపా.. పంజాబ్​లో హంగ్​! - అసెంబ్లీ ఎన్నికల సర్వే

వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections 2022) దాదాపు నాలుగు రాష్ట్రాల్లో భాజపా మిత్రపక్ష కూటమి(bjp allies) పాగా వేయనుందని ఏబీపీ- సీ ఓటర్‌ సర్వే(abp c voter survey) వెల్లడించింది. పంజాబ్‌లో మాత్రం హంగ్‌ ఏర్పడే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. అయితే కాంగ్రెస్‌ కూటమితో ఆమ్‌ఆద్మీపార్టీ అధికారాన్ని చేపట్టే అవకాశం ఉందని తెలిపింది. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు, ఆప్‌ ప్రత్యామ్నాయంగా మారనుందని సర్వే వెల్లడించింది.

state-assembly-elections
అసెంబ్లీ ఎన్నికలు 2022

By

Published : Sep 4, 2021, 6:50 PM IST

మరో ఐదు నెలల్లో ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ సహా పంజాబ్‌ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు(Assembly Elections 2022) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏబీపీ- సీ ఓటర్‌ సర్వే(abp c voter survey) ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఈ ఐదు రాష్ట్రాల్లో నాలుగింటిలో భాజపా మిత్రపక్షం(bjp allies) మరోసారి అధికారాన్ని చేపట్టే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో మరోసారి కమలం పార్టీ పాగా వేయనుందని సర్వే తెలిపింది. దాదాపు 259 నుంచి 267 అసెంబ్లీ స్థానాలను భాజపా కైవసం చేసుకుంటుందని స్పష్టం చేసింది. అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీ 109 నుంచి 117 సీట్లను గెలుచుకుని యూపీలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించనుందని పేర్కొంది. బీఎస్​పీ 12 నుంచి 16 సీట్లను, కాంగ్రెస్‌ కేవలం 3 నుంచి 7 సీట్లను సొంతం చేసుకోనుందని సర్వే తెలిపింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే రానున్న శాసనసభ ఎన్నికల్లో భాజపా 0.4 శాతం ఓటింగ్‌ను పెంచుకుంటుందన్న సర్వే, సమాజ్‌వాది పార్టీకి దాదాపు 6.6 శాతం ఓటింగ్‌ పెరిగే అవకాశం ఉందని తెలిపింది. దాదాపు 44 శాతం మంది యూపీ ప్రజలు యోగీ ఆదిత్యానాథ్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్లు సర్వే పేర్కొంది.

పంజాబ్​లో హంగ్​..

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో(punjab assembly election 2022) మాత్రం హంగ్‌ ఏర్పడే అవకాశం ఉందని.. ఏబీపీ- సీ ఓటర్‌ సర్వే తెలిపింది. దాదాపు 51 నుంచి 57 స్థానాలను ఆమ్‌ఆద్మీపార్టీ, 38 నుంచి 46 స్థానాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకునే అవకాశం ఉందని వెల్లడించింది. శిరోమణి అకాలీదల్‌ 16 నుంచి 24 సీట్లకు పరిమితం కానుందని పేర్కొంది. పంజాబ్‌లో భాజపా ఖాతా తెరవడం కష్టసాధ్యమైన విషయమని ఏబీపీ-సీ ఓటర్‌ సర్వే వెల్లడించింది. ఆప్‌, కాంగ్రెస్‌ కూటమి పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని పేర్కొంది. తదుపరి ముఖ్యమంత్రిగా ఎవర్ని కోరుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు దాదాపు 21.6 శాతం ప్రజలు కేజ్రీవాల్‌ పేరును, 18.8 శాతం సుఖ్‌బీర్‌ బాదల్‌ పేరును ఎంచుకున్నట్లు సర్వే వెల్లడించింది. 17.9 శాతం మంది కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ పేరును, 16.1 శాతం ఆప్‌ ఎంపీ భగ్‌వంత్‌ మన్‌ పేరును, 15.3 శాతం మంది పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జోత్‌ సింగ్‌ సిద్ధూ పేరును ఎంపిక చేసినట్లు సర్వే తెలిపింది. 2017 పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటింగ్‌ 38నుంచి 28శాతానికి తగ్గగా ఆప్‌ మాత్రం 23 నుంచి 35శాతానికి ఓటింగ్‌ను పెంచుకుందన్న విషయాన్ని సర్వే గుర్తుచేసింది.

ఉత్తరాఖండ్​లో మళ్లీ భాజపాకే..

ఉత్తరాఖండ్‌లో(Utterakhand polls) దాదాపు 44 నుంచి 48 స్థానాల్లో గెలుపొంది మరోసారి భాజపా అధికారాన్ని చేపట్టనుందని సర్వే తెలిపింది. 19 నుంచి 23 స్థానాల్లో కాంగ్రెస్‌ కైవసం చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ రెండు స్థానాల్లో గెలుపొంది ఉత్తరాఖండ్‌లో తన ప్రస్థానాన్ని ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొంది. దాదాపు 46 శాతానికి పైగా ఉత్తరాఖండ్‌ ప్రజలు 2024 సాధారణ ఎన్నికల్లో ప్రధాని మోదీకి ఓటు వేస్తామని తెలిపినట్లు సర్వే వెల్లడించింది. 14 శాతం మంది కేజ్రీవాల్‌ను ఎంచుకోగా.. కేవలం 10 శాతం మంది మాత్రమే రాహుల్‌గాంధీ పేరును ఎంచుకున్నారు.

గోవాలో..

గోవా అసెంబ్లీ ఎన్నికల్లోనూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సర్వే తెలిపింది. మొత్తం 40 శాసనసభ స్థానాల్లో 22 నుంచి 26 సీట్లను భాజపా కైవలం చేసుకుంటుందని పేర్కొంది. అయితే గోవాలో ఆమ్‌ ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దాదాపు 4 నుంచి 8 సీట్లను కైవసం చేసుకుని ఆప్‌ ప్రధాన ప్రతిపక్షంగా మారనుందని వెల్లడించింది. కాంగ్రెస్‌ కేవలం 3 నుంచి 7 సీట్లకు పరిమితమయ్యే అవకాశం ఉందని తెలిపింది. దాదాపు 22 శాతానికి పైగా ఓట్లు ఆప్‌కు వచ్చే అవకాశం ఉందన్న సర్వే.. కాంగ్రెస్‌కు 15 శాతం ఓటింగ్‌ నమోదు కావచ్చని వెల్లడించింది.

మణిపూర్​లో..

మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ 32 నుంచి 36 సీట్లను కైవసం చేసుకుని భాజపా మరోసారి అధికారం చేపట్టే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. 18 నుంచి 22 సీట్లతో కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తుందని తెలిపింది. నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ ఎన్​పీఎఫ్​ 2 నుంచి 6 సీట్లకు పరిమితమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే ఏడాది జరగనున్న మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 40 శాతం, కాంగ్రెస్‌ 34 శాతం, ఎన్​పీఎఫ్​ 7 శాతం, స్వతంత్రులు 18 శాతం ఓటింగ్‌ పొందే అవకాశం ఉందని తెలిపింది.

ఇదీ చూడండి:'యూపీలో భాజపాదే మళ్లీ అధికారం- 300 సీట్లు ఖాయం!'

ABOUT THE AUTHOR

...view details