దేశంలో పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలను రైల్వే శాఖ తీర్చేలేకపోతోందన్న చేదు నిజం మరోసారి బయట పడింది. టికెట్ కొన్నా చాలా మంది ప్రయాణానికి దూరమవుతున్నారన్న విషయం ఓ ఆర్‌టీఐ దరఖాస్తు ద్వారా వెల్లడైంది. ఒక్క 2022-2023 ఆర్థిక సంవత్సరంలోనే 2.70 కోట్ల మందికి పైగా ప్రజలు రైల్వే ప్రయాణానికి దూరమయ్యారని తేలింది. మొత్తంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో 1.76 కోట్ల మంది పేర్లు మాత్రమే ప్యాసింజర్ నేమ్ రికార్డ్ (పీఎన్ఆర్) నమోదయయ్యాని రైల్వే శాఖ వెల్లడించింది. వెయిట్‌లిస్ట్ కారణంగా మిగతా వారి పేర్లు ఆటోమేటిక్‌గా రద్దు అయినట్లు పేర్కొంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ దాఖలు చేసిన దరఖాస్తు ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
2021-2022లో 1.65 కోట్ల మంది ప్రయాణించాల్సి ఉండగా.. ప్యాసింజర్ నేమ్ రికార్డ్‌లో 1.06 కోట్ల మంది పేర్లు మాత్రమే నమోదయ్యాయని రైల్వే శాఖ తెలిపింది. ప్రయాణం రద్దు అయిన ప్రయాణికుల సొమ్మును తిరిగి వారికి చెల్లించినట్లు స్పష్టం చేసింది. 2014-15లో 1.13 కోట్లు, 2015-2016లో 81.05 లక్షలు, 2016-17లో 72.13 లక్షలు, 2017-18లో 73 లక్షల మంది ప్రజల రైలు ప్రయాణం రద్దు అయిందని రైల్వే శాఖ వెల్లడించింది. 2018-19లో మరో 68.97 లక్షల మంది ప్రయాణికులు రైలు ప్రయాణం చేయలేకపోయారని పేర్కొంది.