స్వచ్ఛతకు మారుపేరుగా నిలుస్తున్న 'రాక్చామ్' హిమాచల్ ప్రదేశ్..! స్వచ్ఛతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే రాష్ట్రమిది. ఈ రాష్ట్రంలోని ఓ గ్రామం.. స్వచ్ఛ భారత్ అభియాన్ అందించిన తీపి ఫలాలను ఆస్వాదిస్తూ.. స్వచ్ఛతపరంగా దేశంలోనే ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ ఊరి పేరు రాక్చామ్. గ్రామ ప్రజలంతా సవాళ్లను సమష్టిగా ఎదుర్కుంటే.. అందివచ్చే విజయం ఎంత అద్భుతంగా ఉంటుందో చూపిన గ్రామం రాక్చామ్.
"మా గ్రామం గుండా పోయే నదిని దాటేందుకు గతంలో రాళ్లవంతెన ఉండేది. మా భాషలో రాక్ అంటే రాయి అనీ, చామ్ అంటే వంతెన అని అర్థం. అలా.. మా చిన్న గ్రామానికి రాక్చామ్అనే పేరొచ్చింది."
- వినోద్ నేగి, స్థానికుడు
ఇదీ చూడండి:స్కేటింగ్ చేస్తూ భాంగ్రా నృత్య ప్రదర్శన
కష్టాల కోరల్లోంచి..
ఈ విజయం వెనక ఉన్న గాథ, ఊరిప్రజలు పడిన కష్టం.. ఓ గ్రామస్థుడి మాటల్లో విందాం.
"ఊర్లోని అందరి బట్టలూ కుట్టేందుకు ఓ టైలర్ ఉండేవాడు. ఓరోజు రాత్రి బట్టలు ఇస్త్రీ చేస్తుండగా కరెంటు పోయింది. పనిలో పడి, స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోయాడు. దుకాణం కట్టేసి ఇంటికెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత కరెంటు వచ్చి బట్టలన్నీ కాలిపోయాయి. దుకాణం మంటల్లో చిక్కుకుంది. ప్రమాదం జరిగిందని ప్రజలు గుర్తించేటప్పటికే.. మంటలు వేగంగా వ్యాపించడం ప్రారంభమైంది. అలా ఊరంతా మంటలు చెలరేగాయి."
- ఖజాన్ సింగ్, రాక్చామ్ పంచాయతీ ఉప సర్పంచ్
ఊరికి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రజలంతా కలిసికట్టుగా కష్టపడ్డారు. రెండున్నరేళ్ల తర్వాత తమ ఊరు మామూలు స్థితికి వచ్చిందని చెప్తున్నారు గ్రామస్థులు. అందరూ కలిసి నిర్దేశించుకున్న నియమావళిని ప్రతిఒక్కరూ తు.చ. తప్పకుండా పాటిస్తారు.
ఇదీ చదవండి:వైకల్యాన్ని ఎదుర్కొని ఎందరికో ఆదర్శంగా..
"మేమంతా కలిసి ఓ తేదీ ఖరారు చేసుకుంటాం. ఆ రోజున గ్రామప్రజలంతా ఊరికి రావల్సిందే. అందుకు నిరాకరిస్తే జరిమానా విధిస్తాం."
- వినోద్ నేగి, స్థానికుడు
రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం..
పచ్చదనం, పరిశుభ్రతకు మారుపేరుగా నిలుస్తోంది రాక్చామ్. హిమాచల్ ప్రదేశ్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. స్వచ్ఛ గ్రామంగా మారినందుకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారీ ఊరిప్రజలు.
"పంచాయతీ తరఫున ఊరు మొత్తం చెత్తకుండీలు ఏర్పాటు చేశాం. పర్యటకుల కోసం కూడా చాలా చెత్తకుండీలు పెట్టాం. వాటర్ బాటిళ్లు, జూస్ క్యాన్లు, ఇతర ప్లాస్టిక్ కవర్లు వాటిలోనే పడేసేలా జాగ్రత్తలు తీసుకున్నాం. డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న మొదటి ఊరు మాది. ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు ఉన్నాయి. ఊర్లో ఎక్కడా చెత్త కనిపించదు."
- ఖజాన్ సింగ్, రాక్చామ్ పంచాయతీ ఉపసర్పంచ్
ఇదీ చదవండి:కళ్లు లేకపోయినా 40 ఏళ్లుగా మిల్లు నడుపుతూ..
ఇతర వ్యాపారులకు నో ఎంట్రీ..
ఊరి బయటివాళ్లెవరూ ఈ ఊర్లో వ్యాపారాలు చేయకుండా నిషేధం విధించారు. ఇతరులు ఎవరైనా రాక్చామ్లో ఏ వస్తువు విక్రయించాలన్నా గ్రామసర్పంచ్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. రాక్చామ్ ఆధునిక హంగులూ అద్దుకుంది. పర్యాటకుల కోసం అడుగడుగునా ఇండికేటర్ బోర్డులు ఏర్పాటు చేశారు. కాంక్రీటు భవనాల నిర్మాణానికి స్వస్తి చెప్పి.. బదులుగా పర్యటకులకు తమ ఇళ్లలోనే వసతి కల్పిస్తారు. 2019-20 ఏడాదికి గానూ.. జాతీయ స్వచ్ఛత పురస్కారం అందుకుంది రాక్చామ్.
"రాక్చామ్ గ్రామం పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. ఇదంతా గ్రామస్థుల శ్రమకు ఫలితమే. ఆ అగ్నిప్రమాదం తర్వాత ఊరు సర్వం కోల్పోయింది. అన్ని సదుపాయాలూ అగ్నికి ఆహుతయ్యాయి. ఊరికి పునర్వైభవం తెచ్చేందుకు గ్రామస్థులంతా కలిసి కష్టపడ్డారు."
- అవనీంద్ర శర్మ, కిన్నౌర్ ఎస్డీఎం
కిన్నౌర్‌లోని ఈ అందమైన ప్రాంతానికి వెళ్తే.. సర్వస్వం కోల్పోయిన తర్వాత.. కష్టపడి సాధించుకున్న విజయం విలువేంటో అర్థమవుతుంది. ఈ గ్రామం పట్టుదలకు, ఐకమత్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.
ఇదీ చూడండి:దాల్ సరస్సులో 'పడవ ర్యాలీ'కి విశేష స్పందన