తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పంజాబ్​లో నవోదయం- సా'మాన్'యుడిదే సీఎం పీఠం - Assembly Elections 2022

Punjab Assembly elections: పంజాబ్​ రాజకీయాల్లో కొత్త పొద్దు పొడిచింది. దేశ రాజధానిలో వరుస విజయాలను నమోదు చేసుకున్న కేజ్రీవాల్​ పార్టీ.. మరోసారి 'చీపురు' సత్తా ఏంటో దేశానికి చాటి చెప్పింది. దిల్లీలో కాంగ్రెస్‌ను ఓడించి అధికారంలోకి వ‌చ్చిన ఆప్‌.. పంజాబ్​లో కూడా అదే పరంపరను కొనసాగిస్తూ.. ప్రభంజనం సృష్టించింది. ఇంతకీ ఇంతటి ఘన విజయం ఆప్​కు ఎలా సాధ్యమైంది? కేజ్రీవాల్ వ్యూహాలు ఏ మేరకు పనిచేశాయి? 'దిల్లీ మోడల్' నినాదమే గెలిపించిందా? ఇతర పార్టీల పరిస్థితి ఏంటి?

AAP in Punjab Assembly elections
కేజ్రీవాల్

By

Published : Mar 10, 2022, 3:10 PM IST

Updated : Mar 10, 2022, 6:34 PM IST

Punjab Assembly elections: 'సామాన్యుడు' మరో చరిత్ర సృష్టించాడు. సిక్కుల రాష్ట్రంలో నవశకానికి నాంది పలికాడు. పార్టీ గుర్తు అయిన చీపురునే ఆయుధంగా చేసుకొని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ను ఊడ్చేశాడు. 2017 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన ఆమ్​ ఆద్మీ పార్టీ.. ఈసారి సంచలన విజయం సాధించింది. దిల్లీ తరహా 'సంక్షేమ' పాలన అందిస్తామన్న కేజ్రీవాల్​ మాటలను నమ్మిన పంజాబ్​ ఓటర్లు.. ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలను నిజం చేస్తూ.. సామాన్యుడికి పట్టం కట్టారు.

ముఖ్యమంత్రి కేజ్రీవాల్​తో భగవంత్‌ మాన్‌

తుది ఫలితాలు

పార్టీ గెలిచిన స్థానాలు
ఆప్ 94
కాంగ్రెస్ 18
శిరోమణి అకాలీదళ్ 4
భాజపా+ 2
ఇతరులు 1

అయితే ఆమ్​ ఆద్మీ పార్టీకి ఈ విజయం అంత సులువుగా ఏం రాలేదు. ఈ గెలుపు కోసం కేజ్రీవాల్​తో పాటు ఆయన సైనికులు కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరిగారు. ఎన్నో వ్యూహాలు, ప్రతివ్యూహాలతో ఇంతటి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నారు.

భగవంత్‌ మాన్‌తో ఆయన తల్లి హర్పల్​ కౌర్​

సంక్షేమ కార్యక్రమాలే ప్రచారాస్త్రాలుగా..

2017 అసెంబ్లీ ఎన్నికల్లోనే విజయం సాధించాలని చూసినా.. ఆప్‌కు అనుకున్న ఫలితాలు రాలేదు. మొత్తం 117 అసెంబ్లీ సీట్లు ఉండగా.. ఆమ్‌ఆద్మీ 20చోట్ల విజయం సాధించి రెండో స్థానంలో నిలిచింది. అయితే గత ఎన్నికల సమయంలో కాస్తంత దూకుడుగా వ్యవహరించారు పార్టీ అధినేత కేజ్రీవాల్. యాంటీ డ్రగ్స్ ప్రచార కార్యక్రమాలు నిర్వహించటమే కాక.. శిరోమణి అకాలీదళ్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు అలాంటి వ్యక్తిగత ఆరోపణల జోలికి వెళ్లలేదు. కేవలం సంక్షేమ కార్యక్రమాలనే ప్రచారాస్త్రాలుగా మలుచుకుని ప్రజల్లోకి వెళ్లారు. సంప్రదాయ పార్టీలతో విసిగిపోయిన పంజాబీలకు ప్రత్యామ్నాయంగా కనిపించారు.

ఆకర్షించిన హామీలు..

ఆప్​ తన మేనిఫెస్టోను చాలా వ్యూహాత్మకంగా తయారు చేసిందనే చెప్పాలి. అందులో విద్య, ఆరోగ్యం, ఉగ్యోగ కల్పన, ఉచితంగా విద్యుత్, మహిళలకు ఆర్థిక ప్రోత్సాహం​ లాంటి హామీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. అధికారంలోకి వస్తే.. దిగవ, మధ్య తరగతి ప్రజలకు.. ముఖ్యంగా మహిళలకు మేలు చేస్తామని.. ఓటర్లకు తన మేనిఫెస్టోతో నమ్మకం కలిగించింది.

ఆప్​ మేనిఫెస్టోలోని కీలక హామీలు..

  • భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.
  • 300 యూనిట్లు వరకు 24/7 ఉచితంగా విద్యుత్​ అందిస్తాం.
  • మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నియంత్రిస్తాం.
  • రాష్ట్రంలో శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వం నెలకొల్పుతాం.
  • మతవిద్వేషాల కేసుల్లో బాధితులకు న్యాయం.. నిందితులను కఠినంగా శిక్షించడం.
  • అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం.
  • 16,000 మొహల్లా క్లినిక్‌లను ఏర్పాటు చేసి.. ఉచితంగా వైద్యం అందిస్తాం.
  • విద్య, ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచడం.
  • 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలనెలా రూ.1000 ఇస్తాం.
  • రైతుల సమస్యలను పరిష్కరిస్తాం.

దిల్లీ నమూనా పాలన

పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలిస్తే.. దిల్లీ నమూనా పాలన అందిస్తామని కేజ్రీవాల్​ పదే పదే చెప్పారు. దిల్లీలో విద్య, వైద్యం, మౌలిక వసతులకు కేజ్రీవాల్​ తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. దిల్లీలోని ప్రభుత్వ విద్యా సంస్థలను కేజ్రీవాల్​ తీర్చిదిద్దిన తీరు.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారిందనే చెప్పాలి. దిల్లీలో ప్రత్యక్షంగా అమలవుతున్న పథకాలు.. తమ వద్దకు కూడా వస్తే మంచిదని భావించిన ఓటర్లు.. కేజ్రీవాల్​ వైపు మొగ్గారు.

ఆ మైనస్​లే ఆప్​కు ప్లస్​..

ప్రధాన పార్టీలపై ప్రజలకు ఉన్న అసంతృప్తిని క్యాష్​ చేసుకోవడంలో ఆప్​ విజయవంతమైందనే చెప్పాలి. ​అధికార కాంగ్రెస్‌ పార్టీపై వ్యతిరేకత, శిరోమణి అకాలీద‌ళ్‌ కోలుకోకపోవడం.. ఆమ్‌ ఆద్మీ పార్టీకి కలిసొచ్చింది. పంజాబ్‌లో శిరోమ‌ణి అకాలీద‌ళ్ సంస్థాగ‌తంగా బలహీనపడుతూ వచ్చింది. భాజపాతో పొత్తు ముగిసిన తర్వాత ఆ పార్టీ ఎవ‌రితో పోరాడుతుందో అర్థం కాకుండా అయింది. సాగు చ‌ట్టాల‌ను వ్యతిరేకించి భాజపాతో తెగదెంపులు చేసుకున్నా.. రైతుల‌కు ద‌గ్గర కాలేక‌పోయింది. అటు భాజపాకూ దూరమైంది. ఫలితంగా ఈసారి ఎన్నిక‌ల్లో అకాలీద‌ళ్ ప్రభావం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

బెదరకుండా ప్రజల్లోకి..

ఐదేళ్ల క్రితం 20 మంది ఎమ్మెల్యేల‌తో పంజాబ్ అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆప్‌ను అధికార కాంగ్రెస్ అనేక ఇబ్బందులకు గురి చేసింది. దాదాపు సగం మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వెళ్లారు. అయినా క్షేత్రస్థాయిలో పార్టీపై ఓట‌ర్లకు న‌మ్మకం క‌లిగించేందుకు ప్రయ‌త్నించింది ఆమ్‌ ఆద్మీ పార్టీ. క్రమంగా బలపడుతూ వచ్చి.. ఇప్పుడు ఏకంగా అధికారాన్ని కైవసం చేసుకుంది.

రైతు సంఘాలు కూడా ఎన్నికల బరిలో దిగగా.. ఆప్‌కు రావాల్సిన ఓట్లలో చీలిక ఏర్పడతాయని అందరూ భావించారు. అయితే ముందుగా ఊహించినట్లుగానే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఆసరాగా చేసుకుని.. మెజార్టీ ఓటర్లను తమ వైపు తిప్పుకుంది ఆప్​.

భగవంత్‌ మాన్‌ రాకతో మరింత ఊపు..

సీఎం అభ్యర్థి ఎంపిక కోసం ఆప్‌ చేపట్టిన వినూత్న కార్యక్రమం ఆ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చిందని చెప్పాలి. టెలీ ఓటింగ్‌ నిర్వహించి.. భగవంత్‌ మాన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకంటించారు కేజ్రీవాల్​. ప్రజలు ఎన్నుకున్న అభ్యర్థే సీఎంగా ఉంటారని మాన్​ను ముందు పెట్టి.. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయారు​.

మాన్​కు స్థానికంగా మాస్ లీడర్‌గా మంచి గుర్తింపు ఉంది. పైగా పిల్లల కోసం ఓ స్వచ్ఛంద సంస్థ నడుపుతూ పలు సేవా కార్యక్రమాలూ చేస్తున్నారు భగవంత్. ఇది ఆయన వ్యక్తిగత ఇమేజ్​ను మరింత పెంచిందనే చెప్పాలి. తద్వారా ఈ ఎన్నికల్లో పార్టీకి కూడా చాలా మేలు జరిగింది. ఫలితంగా పంజాబ్​ సీఎం పీఠం ఆప్​ వశమైంది.

సరికొత్త ప్రత్యామ్నాయం

పంజాబ్​ రాజకీయాల్లో ఆప్​ రూపంలో సరికొత్త ప్రత్యామ్నాయ శక్తి తెరపైకి వచ్చింది. అధికార కాంగ్రెస్​పై ఉన్న వ్యతిరేకత.. శిరోమణి అకాలీదళ్​ క్రమంగా పట్టు కోల్పోవడం.. భాజపాకు సంస్థాగతంగా బలమైన నిర్మాణం లేకపోవడం.. అమరీందర్​ సింగ్​ కొత్త పార్టీ ఇంకా ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్లలేకపోవడం.. ఆప్​కు కలిసొచ్చిందనే చెప్పాలి.

Last Updated : Mar 10, 2022, 6:34 PM IST

ABOUT THE AUTHOR

...view details