బట్టతల ఉన్న వ్యక్తికి కూడా దువ్వెన అమ్మగల నైపుణ్యాలు.. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్నాయని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ ఎప్పుడూ తప్పుడు వాగ్దానాలు చేస్తారని దుయ్యబట్టారు. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై వచ్చిన ఆరోపణలపై ప్రధాని మోదీ ఎందుకు మాట్లడటం లేదని సంజయ్ సింగ్ ప్రశ్నించారు. ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంజయ్ సింగ్.. ఈ మేరకు ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ఆమ్ ఆద్మీ పార్టీ సంభాల్ మున్సిపల్ ఛైర్మన్ పదవికి పోటీపడుతున్న ఫిజా షాజాద్ తరుఫున.. సంజయ్ సింగ్ ప్రచారం నిర్వహించారు.
మహిళ రెజర్లపై లైంగిక వేధింపులు జరిపిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్.. బ్రిజ్ భూషణ్ సింగ్ విషయంలో మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని సంజయ్ సింగ్ నిలదీశారు. దీనిపై ప్రధాని మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వంపైనా సంజయ్ సింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ కుల రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హథ్రాస్ ఘటన, ఉమేశ్ పాల్ హత్య, లఖీంపుర్ ఖేరీ ఘటన వంటివి యూపీలోనే జరిగాయని సంజయ్ సింగ్ గుర్తు చేశారు. వీటిని యోగీ ప్రభుత్వం అదుపు చేయలేక పోయిందన్నారు. శాంతి భద్రతల విషయంలో యూపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని సంజయ్ సింగ్ ఆరోపించారు.