తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గుజరాత్​లో ఈసారీ అధికారం మాదే.. ఆమ్ ఆద్మీకి 'గుండు సున్నా''

గుజరాత్​లో ఈసారి కూడా భాజపానే విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి అమిత్​ షా ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ఆప్​ ఒక్క స్థానంలో కూడా గెలుపొందే అవకాశం లేదని చెప్పారు. గుజరాత్ ఎన్నికల మేనిఫెస్టోలో భాజపా ప్రకటించిన యాంటీ రాడికలైజేషన్​ సెల్​ ఏర్పాటు హామీని దేశవ్యాప్తంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు.

Gujarat election 2022
gujarat election 2022

By

Published : Nov 30, 2022, 3:43 PM IST

Updated : Nov 30, 2022, 4:59 PM IST

గుజరాత్​లో తొలిసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. ఒక్క స్థానంలో కూడా గెలవదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో భాజపా తిరుగులేని విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భాజపాకు ప్రతిపక్ష పార్టీ అంటే కాంగ్రెస్​ మాత్రమే అని అన్నారు. దేశ భద్రత అన్నది.. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కీలక విషయంగా మారుతుందని ఉద్ఘాటించారు. భాజపా అధికారంలో ఉండగా.. దేశంలో శాంతి భద్రతలకు హాని కలిగించే ఎవరినీ, ఏ సంస్థనూ వదిలేదిలేదని స్పష్టం చేశారు. అందులో భాగంగానే పాపులర్​ ఫ్రంట్​ ఆఫ్ ఇండియా(పీఎఫ్​ఐ)ని నిషేధించినట్లు పీటీఐ వార్తా సంస్థ ముఖాముఖిలో తెలిపారు.

కరోనా కాలంలో ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంలో ఉంటే ఆ ప్రభావం భారత్​లో కొద్ది శాతం మాత్రమే ఉందని చెప్పారు అమిత్ షా. గుజరాత్ ఎన్నికల మేనిఫెస్టోలో భాజపా ప్రకటించిన యాంటీ-రాడికలైజేషన్​ సెల్​ ఏర్పాటు హామీని దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఆమ్​ ఆద్మీ పార్టీకి.. గుండు సున్నా
గుజరాత్‌ ఎన్నికల్లో గెలిచి తీరుతామంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ చేస్తోన్న సవాల్‌ను భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడూ కొట్టిపడేస్తూనే ఉంది. ప్రతి పార్టీకి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుందని కేంద్ర హోంమంత్రి అన్నారు. అయితే ఆ పార్టీని ఆమోదించాలా? వద్దా? అన్నది ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు. బడ్జెట్‌కు మించిన హామీలు కురిపిస్తే అవి నెరవేర్చలేరని ప్రజలకు కూడా తెలుసన్నారు. 'గుజరాత్‌ ప్రజల ఆలోచనల్లో ఆప్ అనేదే లేదు. ఎన్నికల ఫలితాలు వరకు ఎదురుచూడండి. గెలిచిన అభ్యర్థుల జాబితాలో ఆమ్‌ ఆద్మీ పార్టీ పేరే కన్పించదు' అంటూ అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కాంగ్రెస్​నే ప్రధాన అభ్యర్థి..
"రాజకీయ నాయకులు నిత్యం కష్టపడి పనిచేయాలి. కానీ రాజకీయాల్లో మాత్రం నిరంతరంగా శ్రమించే వారికే మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి దానికోసం కొంత కాలం వేచి చూడాలి" అన్నారు. తమకు ఇంకా కాంగ్రెస్సే ప్రధాన ప్రత్యర్థి అని అమిత్ షా తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ పార్టీ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని.. గుజరాత్‌ ఎన్నికల్లోనూ ఆ ప్రభావం కన్పిస్తుందని అన్నారు.

జాతీయ భద్రత..
ప్రజల దృష్టిని మరల్చేందుకే భాజపా గుజరాత్​ ఎన్నికల్లో ఉగ్రవాదం వంటి జాతీయ సమస్యలను లేవనెత్తుతోందన్న ప్రతిపక్షం మాటలను అమిత్​ షా కొట్టిపడేశారు. 'గుజరాత్ భద్రత జాతీయ భద్రతతో ముడిపడి ఉందా లేదా?. గుజరాత్ భద్రత, జాతీయ భద్రత వేర్వేరు సమస్యలు కావు. మరి దేశానికి భద్రత లేకపోతే గుజరాత్ ఎలా సురక్షితంగా ఉంటుంది?' అని ప్రశ్నించారు. గుజరాత్​ సరిహద్దు రాష్ట్రం కావడం వల్ల అక్కడ భద్రత అనేది చాలా సున్నితమైన విషయం అని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారన్న ప్రతిపక్షం ఆరోపణలను అమిత్‌ షా ఖండించారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగం జరిగితే.. అప్పుడు వారు న్యాయవ్యవస్థను ఆశ్రయించవచ్చు అని షా అన్నారు. ప్రస్తుతం దేశంలో తటస్థ న్యాయవ్యవస్థ ఉందని స్పష్టం చేశారు.

యాంటీ-రాడికలైజేషన్​ సెల్..
గుజరాత్​లో మళ్లీ భాజపా విజయం సాధిస్తే.. రాడికలైజేషన్ వ్యతిరేక సెల్‌ను ఏర్పాటు చేస్తామని పార్టీ ఎన్నికల వాగ్దానాన్ని గొప్ప విషయంగా అభివర్ణించారు షా. తీవ్రవాదం కట్టడికి భాజపా ప్రభుత్వం బలంగా కృషి చేస్తోందని అన్నారు. అందులో భాగంగానే యువతను పక్కదోవ పట్టించే.. పాపులర్​ ఫ్రంట్​ ఆఫ్ ఇండియా(పీఎఫ్​ఐ)ని కూడా నిషేధించినట్లు తెలిపారు. యాంటీ-రాడికలైజేషన్​ సెల్​ను అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని అమిత్​ అన్నారు.

ప్రాంతీయ పార్టీల ప్రభావం..
భాజపాను ఎదుర్కొనడానికి ప్రాంతాల పార్టీలు చేసే ప్రయత్నాలు ఫలించవని అభిప్రాయపడ్డారు షా. అవన్నీ కాగితాలవరకే పరిమితం అని.. ఒక రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీ మరో రాష్ట్రంలో కొంచెం కూడా ప్రభావం చూపే అవకాశం లేదని విశ్లేషించారు. గత ఎనిమిదేళ్లలో మోదీ సాధించిన ప్రజాదరణ ముందు ఇవన్నీ నిలవలేవని అభిప్రాయపడ్డారు. "ప్రస్తుతం బంగాల్​లో భాజపా ఓట్ల శాతం 40 శాతానికి పైగా పెరిగి.. 18 స్థానాల్లో గెలుపొందింది. తర్వాత ఎన్నికల్లో మా బలాన్ని మరింత పెంచుకుంటాం" అన్నారు. తెలంగాణలో భాజపా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్​లోనూ పార్టీ బలంగానే ఉందని తెలిపారు.

మాతృభాషలో విద్యాబోధన..
దేశంలో ఇంగ్లీషురాని విద్యార్థుల ప్రతిభను శాస్త్ర సాంకేతిక, వైద్య, న్యాయ రంగాల్లో వినియోగించుకోవాలంటే మాతృభాషలోనే విద్యాభ్యాసం ఉండాలని అభిప్రాయపడ్డారు అమిత్ షా. మాతృభాషలో చదివితేనే వారు సులభంగా అర్థం చేసుకుని.. కొత్త ఆవిష్కరణలకు అవకాశం ఉంటుందన్నారు. సాంకేతికం, వైద్యం, న్యాయ విద్యను.. హిందీ, ఆంగ్లంతో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లోనూ అందించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేయాలని పిలుపునిచ్చారు.

Last Updated : Nov 30, 2022, 4:59 PM IST

ABOUT THE AUTHOR

...view details