గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి ఈశుదాన్ గఢ్వీ ఎంపికయ్యారు. సీఎం అభ్యర్థి కోసం ఆన్లైన్ పోల్ నిర్వహించిన ఆప్.. ఈ మేరకు గఢ్వీని ఎంపిక చేసింది. ఆన్లైన్ పోల్ ఫలితాలను ప్రకటించిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. గఢ్వీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తెలిపారు. మొత్తం 16 లక్షల మంది ఓటింగ్‌లో పాల్గొన్నారని చెప్పిన కేజ్రీవాల్.. అందులో 73 శాతం మంది గఢ్వీని ఎన్నుకున్నట్లు తెలిపారు.
ఎవరీ ఈశుదాన్ గఢ్వీ
గుజరాత్ ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపికైన ఈశుదాన్ గఢ్వీ ఓ జర్నలిస్టు. ఓబీసీ వర్గానికి చెందిన ఈయన.. దేవభూమి ద్వారకా జిల్లాలోని పిప్లియాలో జన్మించారు. జామ్ ఖంభాలియాలో తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. కామర్స్‌లో పట్టభద్రుడయ్యాక, 2005లో గుజరాత్ విద్యాపీఠ్‌లో జర్నలిజం చదివారు.
ఆ తర్వాత దూరదర్శన్‌లో చేరి అక్కడ ఓ షో చేయడం ప్రారంభించారు. పోర్‌బందర్‌లోని 'ఈటీవీ గుజరాతీ' ఛానెల్‌లో రిపోర్టర్‌గా పనిచేశారు. 2015లో ఈశుదాన్ అహ్మదాబాద్‌లోని ఓ ప్రముఖ గుజరాతీ ఛానెల్‌కు ఎడిటర్ అయ్యారు. 'మహామంథన్' పేరుతో ఓ షోను ప్రారంభించిన ఈశూదాన్.. అందులో యాంకర్‌గా వ్యవహరించారు. ఈ షోతో ఆయనకు రాష్ట్రంలో మంచి పేరు వచ్చింది.