తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బ్రేకప్‌ చెప్తానని అన్నందుకే హత్య చేశా'.. నార్కో పరీక్షలో ఆఫ్తాబ్‌!

శ్రద్ధా తనను వదిలి వెళ్లిపోతానని బెదిరించడంతోనే ఆమెను హత్య చేశానని నిందితుడు ఆఫ్తాబ్‌ పూనావాలా.. నార్కో పరీక్షలో వెల్లడించాడట. మరోవైపు.. శుక్రవారం ఉదయం ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీ బృందం తిహాడ్‌ జైలుకు వెళ్లింది. నార్కో పరీక్ష తర్వాత దర్యాప్తు అధికారి ఆఫ్తాబ్‌ను మరోసారి విచారించారు.

shraddha walker murder case
shraddha walker murder case

By

Published : Dec 2, 2022, 3:33 PM IST

సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్‌ పూనావాలాకు గురువారం నార్కో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలను ఆఫ్తాబ్‌ వెల్లడించినట్లు సమాచారం. శ్రద్ధా తనను వదిలి వెళ్లిపోతానని బెదిరించిందని, అందుకే ఆమెను చంపేశానని నిందితుడు వైద్యులకు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

బ్రేకప్‌ చెప్తానని అన్నందుకే..
ఆఫ్తాబ్‌, శ్రద్ధా బంధంలో విభేదాలు తలెత్తాయి. తరచూ వేధించడం, శారీరకంగా హింసించడంతో విసుగెత్తిన శ్రద్ధా.. అతడి నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది. ఇదే విషయమై మే 3, 4 తేదీల్లో వీరి మధ్య చర్చ జరిగింది కూడా. అయితే తనను రిజెక్ట్‌ చేయడాన్ని ఆఫ్తాబ్‌ సహించలేకపోయాడు. తనకు బ్రేకప్‌ చెప్పి శ్రద్ధా మరొకరితో వెళ్లిపోతుందేమోనని ఆమెపై కోపం పెంచుకున్నాడు. అటు ఇంటి ఖర్చులు, పెళ్లి విషయంలో తరచూ గొడవలు జరిగేవి. మే 18న కూడా వీరి మధ్య గొడవ జరిగింది. ఇక తనతో కలిసి ఉండేది లేదని.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతానని శ్రద్ధా బెదిరించింది. దీంతో ఆవేశానికి గురై ఆమెను గొంతు నులిమి చంపేశానని ఆఫ్తాబ్‌ నార్కో పరీక్షలో వెల్లడించినట్లు సమాచారం. అయితే క్షణికావేశంలోనే శ్రద్ధాను చంపానని ఆఫ్తాబ్‌ చెబుతున్నప్పటికీ.. పక్కా ప్లాన్‌తోనే ఈ హత్యకు నిందితుడు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

20-25 ప్రశ్నలు.. వచ్చే వారానికి శ్రద్ధ డీఎన్‌ఏ నివేదిక!
దిల్లీలోని రోహిణి ప్రాంతంలో గల ఆసుపత్రిలో రెండు గంటల పాటు ఆఫ్తాబ్‌కు నార్కో పరీక్ష నిర్వహించారు. ఇందులో అతడిని కేసు గురించి సాధారణమైన 20-25 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. వీటన్నింటికీ ఆఫ్తాబ్‌ సమాధామిచ్చాడట. తన సహజీవన భాగస్వామిని అతి కిరాతకంగా చంపిన కేసులో ప్రధాన నిందితుడైన అఫ్తాబ్‌ పూనావాలాకు పోలీసులు పాలీగ్రాఫ్‌, నార్కో పరీక్షలు నిర్వహించగా ఈ రెండు టెస్ట్‌ల్లోనూ అతడు చెప్పిన సమాధానాలు ఒకేలా ఉన్నాయని తెలుస్తోంది. 14 రోజుల పోలీస్‌ కస్టడీలో ఉన్నప్పుడు దర్యాప్తులో ఎలాంటి సమాధానాలు ఇచ్చాడో.. పాలీగ్రాఫ్‌, నార్కో టెస్ట్‌ల్లోనూ అదేరకంగా స్పందించినట్టు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రెండు టెస్ట్‌ల్లోనూ పోలీసులకు పూర్తిగా సహకరించాడని, పోలీసుల దర్యాప్తులో చెప్పిన సమాధానాలే ఈ పరీక్షలప్పుడు కూడా చెప్పాడని పేర్కొంటున్నారు. శ్రద్ధను తానే చంపి ఆమె శరీర భాగాలను దిల్లీలోని అటవీ ప్రాంతంలో విసిరేసినట్టు అంగీకరించాడన్నారు. అయితే, ఇప్పటికే కొన్ని శరీర భాగాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. ఆమె పుర్రెను ఇంకా గుర్తించాల్సి ఉంది. శ్రద్ధ డీఎన్‌ఏ నివేదిక వచ్చే వారంలో వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అతడు శ్రద్ధను చంపాడని నిరూపించడానికి తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని.. అయినా ఇంకా డిజిటల్‌ ఫుట్‌ప్రింట్స్‌, సాక్ష్యాధారాల కోసం చూస్తున్నామన్నారు. ఇవి దర్యాప్తులో కీలక పాత్ర పోషిస్తాయని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.

తిహాడ్‌ జైలుకు ఫోరెన్సిక్‌ బృందం
మరోవైపు.. శుక్రవారం ఉదయం ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీ బృందం తిహాడ్‌ జైలుకు వెళ్లింది. నార్కో పరీక్ష తర్వాత దర్యాప్తు అధికారి ఆఫ్తాబ్‌ను మరోసారి విచారించారు. ఈ పరీక్షలో చెప్పిన సమాధానాలను కూడా నిందితుడికి చెప్పారు.

ఇవీ చదవండి :'శ్రద్ధను చంపినందుకు బాధేమీ లేదు'.. పాలిగ్రాఫ్ పరీక్షలో అఫ్తాబ్‌

శ్రద్ధ హత్య కేసులో అఫ్తాబ్​ నార్కో టెస్ట్​ 'సక్సెస్'​.. కానీ ఆ సాక్ష్యాలు చెల్లవట!

ABOUT THE AUTHOR

...view details