Maharashtra Crisis News: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన తారస్థాయికి చేరిన నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్యేలపై శివసేన నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మరోసారి శివసేన రెబల్ ఎమ్మెల్యేలపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మంత్రి ఆదిత్యఠాక్రే మరోసారి విరుచుకుపడ్డారు. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం చేసిన తప్పేంటో ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పాలని రెబల్ ఎమ్మెల్యేలకు ఆయన సవాల్ విసిరారు. ఈ మేరకు ఓ జాతీయ వార్త సంస్థతో ఆయన మాట్లాడారు.
‘‘వాళ్లు రెబల్స్ కాదు.. ద్రోహులు. ఇక్కడి నుంచి పారిపోయి వాళ్లంతట వాళ్లే రెబల్ అని అనుకుంటున్నారు. తిరుగుబాటు చేయాలనుకుంటే ఇక్కడే ఉండి చేయాల్సింది. ఇలాంటి వారు ఎప్పటికీ గెలవలేరు. మాకు అందరి మద్ధతు ఉంది. మేం గెలుస్తామన్న నమ్మకం ఉంది’’ అని ఆదిత్య ఠాక్రే అన్నారు. ‘మహా’ రాజకీయ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.