Aadhaar Number On Degree Certificate :డిగ్రీ మార్కుల మెమో, ప్రొవిజనల్ సర్టిఫికెట్లపై ఆధార్ నంబరు ముద్రించడాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) నిలిపివేసింది. ఈ మేరకు ఉన్నత విద్యాసంస్థలన్నీ UIDAI నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. సర్టిఫికెట్లపై ఆధార్ నెంబర్లు ముద్రించడం వల్ల వ్యక్తిగత వివరాలు బయటకు వెళ్లే అవకాశముందన్న ఆందోళనలను పరిగణలోకి తీసుకుని UGC ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనల ప్రకారం ఆధార్ నంబర్‌ను మెమోపై ముద్రించకూడదని యూజీసీ సెక్రటరీ మనీశ్ జోషీ చెప్పారు. ఈ మేరకు అన్ని విశ్వవిద్యాలయాలకు లేఖలు రాశారు. యూనివర్సిటీలు జారీ చేసే ప్రొవిజనల్ సర్టిఫికెట్లు, డిగ్రీ మార్కుల మెమోలపై పూర్తి ఆధార్ నంబర్లను ముద్రించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలిస్తున్న వేళ UGC ఈ ఆదేశాలను జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మాతృ భాషలోనే పరీక్షలు
మరోవైపు, డిగ్రీ విద్య అభ్యసించే విద్యార్థులకు ఇటీవలే కీలక ఆదేశాలు జారీ చేసింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ). ఇక నుంచి విద్యార్థి చదువుతున్న కోర్సు ఆంగ్ల మాధ్యమంలో ఉన్నప్పటికీ సదరు విద్యార్థి లేదా విద్యార్థిని స్థానిక భాష అంటే మాతృ భాషలో పరీక్షలు రాసేందుకు అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఏర్పాట్లు చేయాలని చెప్పింది. ఒక స్టూడెంట్ తనకు నచ్చిన కోర్సును ఇంగ్లిష్ మీడియంలో తీసుకున్నా సరే వారి స్థానిక లేదా మాతృ భాషలో పరీక్షలు రాయాలనుకుంటే అనుమతివ్వాలని దేశంలోని అన్ని యూనివర్సిటీలకు సూచించారు యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్.