Aadhaar New Update Iris : వేలిముద్రలు పడనివారు ఐరిస్ స్కాన్ ద్వారా ఆధార్‌ను పొందవచ్చని కేంద్రం ప్రకటించింది. వేళ్లు లేని కారణంగా ఆధార్ పొందలేనివారు ఐరిస్ స్కాన్ ద్వారా ఆధార్ కార్డు పొందవచ్చని పేర్కొంది. కేరళకు చెందిన ఓ మహిళకు ఆధార్ కార్డు జారీ జాప్యమైన నేపథ్యంలో కేంద్రం ఈ విషయాన్ని ప్రకటించింది.
అసలేం జరిగిందంటే?
ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ సమయంలో కొట్టాయంకు చెందిన పీ జోస్ అనే మహిళ చేతి వేళ్లు లేకపోవడం వల్ల వేలిముద్రలు వేయలేకపోయింది. దీంతో ఆమెకు ఆధార్ కార్డు మంజూరు అవ్వలేదు. ఈ విషయం కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ దృష్టికి వచ్చింది. ఆయన జోక్యంతో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) బృందం జోస్ ఇంటిని సందర్శించి ఆమెకు ఆధార్ కార్డును మంజూరు చేసింది.
ఈ నేపథ్యంలో చేతివేళ్లు లేని వ్యక్తులు, అస్పష్టంగా వేలిముద్రలు పడినవారు లేదా చేతి అంగవైకల్యం ఉన్నవారు ఐరిస్ ద్వారా ఆధార్ కార్టు పొందవచ్చని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించారు. ఐరిస్ స్కాన్ ద్వారా బయోమెట్రిక్ తీసుకుని వారికి ఆధార్ కార్డు జారీ చేయాలని ఆధార్ సేవా కేంద్రాలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఐరిస్, వేలిముద్రలు సమర్పించలేకపోయినా అర్హులైన వారికి కూడా ఆధార్ అందజేయాలని ప్రభుత్వం ఇదివరకే నిబంధనల్లో పేర్కొంది. ఈ రెండు ఆధారాలు సమర్పించలేకపోవటానికి గల కారణాల్ని తెలుపుతూ ఫొటో ద్వారా ఆధార్‌కు నమోదు చేసుకోవచ్చు.