అప్పుడే పుట్టిన పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. తెలంగాణతోపాటు మరో 15 రాష్ట్రాల్లో ప్రస్తుతం.. ఈ విధానం అమలు చేస్తుండగా త్వరలోనే అన్ని రాష్ట్రాలకు విస్తరించనున్నట్లు వెల్లడించింది. తెలంగాణలో గతేడాది నుంచే జనన ధ్రువీకరణ పత్రాన్ని ఆధార్‌తో అనుసంధానం చేశారు.
తాజాగా అన్ని రాష్ట్రాలకు విస్తరించేందుకు భారత ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్) చర్యలు ముమ్మరం చేసింది. ప్రస్తుతం ఐదేళ్లలోపు చిన్నారులకు.. ఆధార్ ఇచ్చినప్పటికీ వారి వేలిముద్రలు, ఐరిస్ నమోదు చేయకుండా పిల్లల ఫొటోను తల్లిదండ్రుల ఆధార్‌తో అనుసంధానిస్తున్నారు. తర్వాత 5 నుంచి 15 ఏళ్ల మధ్య బయోమెట్రిక్‌ను అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పించారు. ఆధార్ ఆధారంగా.. కేంద్ర, రాష్ట్రాల్లోని దాదాపు వెయ్యి పథకాల్లో లబ్ధిదారులను నిర్ణయిస్తున్నారు. ఇప్పటివరకూ 134 కోట్ల ఆధార్ కార్డులను జారీ చేసినట్లు ఉడాయ్ వెల్లడించింది.