NITI Aayog ceo: ప్రపంచంలోనే అత్యుత్తమ బయోమెట్రిక్ ఆధారిత గుర్తింపు కార్యక్రమం 'ఆధార్' అని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు పునాదిలా నిలుస్తోన్న ఆధార్‌తో నకిలీలను గుర్తించడం ద్వారా ప్రభుత్వానికి రూ.2లక్షల కోట్లకుపైగా ఆదా అయినట్లు చెప్పారు. ఆధార్ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు తీసుకున్న చర్యలపై దిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన అమితాబ్‌కాంత్ ఈ వివరాలు వెల్లడించారు.
"315 కేంద్ర పథకాలు, 500 రాష్ట్ర పథకాలు సమర్థంగా అమలు చేసేందుకు ఆధార్‌ను వినియోగించుకోవడం అభినందనీయ విషయం. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ ఓ పునాదిలా మారింది. మధ్యవర్తుల ప్రమేయం, ఎటువంటి అంతరాయాలు లేకుండా లబ్ధిదారులకు వేగంగా ప్రయోజనాలు నేరుగా అందించింది. దీంతో పాటు నకిలీలను నిర్మూలించడం వల్ల ప్రభుత్వానికి రూ.2లక్షల కోట్లకుపైగా ఆదా అయ్యింది. ఇతర దేశాల్లోనూ ఈ విధానాన్ని అవలంబించే అవకాశాలపై ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలతో చర్చలు జరిపాం."
- నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్.