బిహార్ సీఎం నితీశ్‌పై దాడి.. నిందితుడు అరెస్ట్ - నితీశ్ కుమార్‌పై దాడి
20:08 March 27
బిహార్ సీఎం నితీశ్‌పై దాడి.. నిందితుడు అరెస్ట్
Youth Attack on CM Nitish Kumar: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. సీఎం సొంత ఊరైన బక్తియార్పుర్లో ఆదివారం ఈ ఘటన జరిగింది. దాడికి యత్నించిన వ్యక్తిని అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
స్థానిక ఆసుపత్రి ప్రాంగణంలో షిల్‌భద్ర యాజీ అనే స్వాతంత్య్ర సమరయోధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నితీశ్ హాజరయ్యారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తుండగా.. వెనుక నుంచి వేగంగా నడుచుకుంటూ స్టేజ్‌పైకి వచ్చిన ఓ యువకుడు సీఎం వీపుపై కొట్టాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది.. ఆ వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి మానసిక స్థితి సరిగాలేదని తెలుస్తోంది. భద్రతా సిబ్బంది ఉండగా ఓ సాధారణ వ్యక్తి ఇలా దాడికి పాల్పడటం భద్రతా వైఫల్యాన్ని తెలియజేస్తోంది. అయితే దాడికి పాల్పడిన యువకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని నితీశ్ అధికారులకు స్పష్టం చేశారు. యువకుడు చేసిన ఫిర్యాదులను పరిశీలించి ఆ సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.