Man killed friend for loving his girlfriend in Nizamabad : తెలంగాణ వ్యాప్తంగా ఓ ఇంజినీరింగ్ విద్యార్థి నవీన్ హత్యోదంతం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నవీన్ హత్య ఘటన మరవకముందే అలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలో మరొకటి చోటుచేసుకుంది. తను ప్రేమించిన అమ్మాయిపై మనసు పడ్డాడనే కోపంతో స్నేహితుడి అత్యంత దారుణంగా హతమార్చాడు ఓ యువకుడు. అయిదు నెలల క్రితం నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నందిపేట్ ఎస్సై శ్రీకాంత్ చెప్పిన వివరాల ప్రకారం..నందిపేట మండలంలోని ఆంధ్రానగర్ పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో సంచార కుటుంబాలు ఉంటున్నాయి. అక్కడే చిన్న వెంకటరమణ కుటుంబం కూడా నివాసముంటోంది. వెంకటరమణ కుమారుడు కార్తీక్(22), బాపట్ల రాజు(22) ఇద్దరూ మంచి స్నేహితులు.
Nizamabad murder case update : ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువతి తరచూ రాజు ఇంటికి వస్తుండేది. రాజుతో పాటు కార్తీక్‌కు కూడా ఆమె స్నేహితురాలే. అయితే ఈ స్నేహం కాస్త ప్రేమగా మారి.. ఇద్దరూ ఆమె ప్రేమలో పడ్డారు. ముందుగా ఆ యువతిని ప్రేమించిన రాజు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ తన స్నేహితుడు కార్తీక్ కూడా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని రాజుకు తెలిసింది. ఈ విషయం తెలిసిన తర్వాత రాజుకు కార్తీక్‌పై కోపం వచ్చింది. తనకు కాబోయే భార్యను ప్రేమిస్తున్నాడని అతడిపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా తన ప్రేమకు, పెళ్లికి అడ్డుగా వస్తున్న కార్తీక్‌ను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు.
Man killed friend for loving his girlfriend : ఈ క్రమంలోనే తన తమ్ముడు హరీశ్‌తో కలిసి కార్తీక్‌ను చంపేందుకు కుట్ర పన్నాడు. పక్కా ప్లాన్ ప్రకారం సెప్టెంబర్ 20, 2022న నందిపేట్ శివారులోని ఎల్లమ్మ గుడి వద్దకు ముగ్గురూ కలిసి వెళ్లారు. వారితో కలిసి తెచ్చుకున్న మద్యం సేవించారు. కార్తీక్‌కు ఎక్కువ మద్యం సేవించేలా రాజు, హరీశ్‌లు ప్రేరేపించారు. మద్యం మత్తులో ఉన్న కార్తీక్‌ను విజయనగరం గుట్ట వద్దకు తీసుకువెళ్లి తలపై కర్రతో దారుణంగా కొట్టారు. ఆ దెబ్బలకు కార్తీక్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం విజయనగరం గుట్ట ప్రాంతంలో రాళ్ల మధ్య కార్తీక్ మృతదేహాన్ని పడవేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిరోజులకు ఆ యువతిని రాజు పెళ్లి చేసుకున్నాడు.
కార్తీక్ కనిపించికపోవడంతో అతడి తల్లి బతుకుదెరువు కోసం ఆంధ్రపదేశ్‌కు వెళ్లి ఉంటాడని భావించారు. అయితే ఇటీవల అబ్దుల్లాపూర్‌మెట్‌లో జరిగిన హత్య లాంటిదే తమ ఊళ్లోనూ జరిగిందని ఊళ్లో అందరూ మాట్లాడుకుంటుండగా ఆ మాట వెంకటరమణ వద్దకు చేరింది. కార్తీక్‌ను చంపేసి విజయనగరం గుట్ట ప్రాంతంలో పడేశారని కొందరు గ్రామస్థులు ఆమెకు చెప్పారు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు గుట్ట ప్రాంతంలో పరిశీలించగా ఓ అస్థి పంజరం కనిపించింది.
జిల్లా ఆసుపత్రి ఫోరెన్సిక్ విభాగాధిపతి ఫ్రొఫెసర్ నాగమోహన్‌రావు ఆ అస్థిపంజరానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికలో ఆ అస్థిపంజరం కార్తీక్‌దేనని నిర్ధారణ అయింది. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీయగా చివరగా కార్తీక్ రాజు, హరీశ్‌లను కలిసినట్లు తేలింది. లోతుగా దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న నిందితులు రాజు, హరీశ్ పరారీ అయ్యారు. వీలైనంత త్వరగా వారిని పట్టుకుంటామని నందిపేట్ ఎస్సై తెలిపారు.