రోవర్‌ను తయారు చేసిన విద్యార్థులు చంద్రుడిపై అయినా అంగారక గ్రహంపై అయినా.. ఓ రోవర్ అడుగు పెట్టాలంటే దానికంటే ముందు కొన్నేళ్లుగా ప్రయోగాలు జరుగుతాయి. నది ఒడ్డున ట్రయల్ రన్ నిర్వహించడం చివరి దశ ప్రయోగాల్లో ఒకటి. అలా.. పొదల మధ్య, ఎగుడుదిగుడు నేలపైన చేపట్టిన ప్రయోగాల్లో ఒడిశాకు చెందిన ఓ పరిశోధక బృందం తయారుచేసిన రోవర్ విజయం సాధించింది. ఆ బృందం ఎదురు చూస్తోంది నాసా నుంచి గ్రీన్ సిగ్నల్ కోసమే. 10 మంది హైస్కూల్ విద్యార్థులతో కూడిన బృందం.. యువ శాస్త్రవేత్త అనిల్ ప్రధాన్‌తో కలిసి రోవర్ నాప్‌శాట్ 1.0ను రూపొందించారు.
"ప్రాజెక్టు పూర్తైన తర్వాత నాకు పూర్తి సంతృప్తిగా అనిపించింది. ఈ ప్రాజెక్టు నుంచి చాలా నేర్చుకున్నా. సైకిల్ రిపేరింగ్ షాపులో పనిచేసేవాడిని. అక్కడ నేర్చుకునేందుకు పెద్దగా అవకాశం ఉండేది కాదు. ఇక్కడ అన్ని వ్యవస్థల గురించి నేర్చుకునే అవకాసం దక్కింది."
- కైలాశ్ చంద్ర బారిక్, పరిశోధక బృంద సభ్యుడు
"కొవిడ్ కారణంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కున్నా. గతంలో వెల్డింగ్ షాపులో పనిచేసేవాడిని. ఆ తర్వాత ఓ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో చదువుకున్నా. అక్కడే ఈ ప్రాజెక్టులో చేరాను. ఇక్కడా వెల్డింగ్ లాంటి పనులే చేస్తున్నాను. పనంతా పూర్తైన తర్వాత చాలా సంతృప్తిగా అనిపించింది."
- రినా బాగ్, పరిశోధక బృంద సభ్యుడు
"నాసా ఓ మిషన్ చేపట్టనుంది. 2024లో చంద్రుడిపైకి మొదటగా ఓ మహిళను పంపే ప్రాజెక్టును చేపట్టనుంది. ఆ తర్వాత మరో వ్యక్తిని పంపాలని నిశ్చయించుకుంది. అలాగే 2028లో అంగారక గ్రహం పైకి కూడా ఇద్దరు వ్యక్తులను పంపే ప్రాజెక్టుపై ప్రయోగాలు చేస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులకూ ఓ మెకానికల్ రోవర్ అవసరముంటుంది. ఆ మేరకు మా రోవర్ ఎంపికైంది."
- రుశికేశ్ అమిత్ నాయక్, టీమ్ లీడర్
ఎనిమిది నెలలు సుదీర్ఘ పరిశోధన చేసిన తర్వాత.. ఒడిశాకు చెందిన ఈ పరిశోధక బృందం నాసా హ్యూమన్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్ కోసం రోవర్ తయారుచేసింది. 4 చక్రాల ఈ రోవర్‌లో ఇద్దరు కూర్చునే సదుపాయం ఉంది. 2024లో చంద్రుడిపై, 2028లో అంగారక గ్రహంపైకి నాసా.. రోవర్‌తో పాటు ఓ మహిళను, ఓ వ్యక్తిని పంపనుంది. అక్కడ నీరు, ఇతర లవణాల ఉనికిని ఈ రోవర్‌తోనే పరీక్షంచనుంది. అందుకే ప్రభావవంతమైన రోవర్‌కోసం నాసా శోధన మొదలుపెట్టింది. గతంలోనే ఒడిశా రోవర్ నమూనా సామర్థ్యాన్ని నాసా పరీక్షించింది. ఇప్పటికే న్యాప్‌సార్ 1.0 రోవర్ వీడియోను నాసాకు పంపించారు. ఈ ఒడిశా రోవర్ పనితీరుపై మరికొద్ది రోజుల్లో నాసా స్పందన తెలియజేయనుంది.
"మా బృందంలో నగరాలకు చెందినవారే కాదు... ముగ్గురు గ్రామీణ యువకులు కూడా ఉన్నారు. ఒకరు సైకిల్ రిపేర్ దుకాణంలో పనిచేసే అబ్బాయి. మరో అబ్బాయి వెల్డింగ్ చేసుకునేవాడు. ఇంకొకరు కూలీ పని చేసుకుంటూ బతికేవాడు. 19 ఏళ్ల లోపు పరిశోధకులూ మా బృందంలో ఉన్నారు. నాసా రోవర్ ఛాలెంజ్‌ను మా బృందం గెలిచింది. మా సిఫారసును నాసా ఆమోదించింది. మా పరిశోధకులు 8 నెలల నుంచి ఈ రోవర్‌ను రూపొందించే ప్రాజెక్టు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారందరి శ్రమకు ఫలితం ఇప్పుడు కళ్ల ముందు కనబడుతోంది."
- అనిల్ ప్రధాన్, మిషన్ చీఫ్
"ఈ మోడల్ అంగారక గ్రహం కోసం డిజైన్ చేశాం. నాసా దీన్ని అంగారకుడిపై ప్రయోగించాలనుకుంటోంది. దీన్ని అమెరికా నుంచే ప్రయోగించాలని అనుకున్నాం కానీ.. కరోనా సంక్షోభం వల్ల కార్యక్రమం వర్చువల్‌గా సాగుతోంది. అంగారకుడిపై అన్ని నమూనాలు సేకరించనుంది ఈ మోడల్. ద్రవాల నమూనాలు సేకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. అన్ని నమూనాలు పరీక్షించిన తర్వాత, సమాచారం పంపిస్తుంది."
- వైశాలి శర్మ, ప్రాజెక్టు డైరెక్టర్
ఈ యువ శాస్త్రవేత్తలంతా దేశం కోసం ఏదో చేయాలని తపిస్తున్నవారే. నాసా వీరి మోడల్‌ను ఎంపిక చేస్తే దేశానికే గర్వకారణంగా నిలుస్తారీ పరిశోధకులు.
ఇదీ చూడండి:పెట్రోల్ వాహనాలకు ప్రత్యామ్నాయం ఈ 'సోలార్ కార్'!