అవమాన భారంతో యువకుడి ఆత్మహత్య An innocent youth was killed in the bike theft case: "చేయని తప్పులకు ఎవరు ఫ్రెండ్స్.. దెబ్బలు తినేది, తిట్లు తినేది..? దొంగతనం అంటేనే నచ్చదు మనకు.. అట్లాంటిది దొంగతనం నేరం మీదేస్తే ఎట్లా ఫ్రెండ్స్.. మీరు ఈ వీడియో చూసేసరికి నేను ఉంటానో లేదో తెలియదు..." అంటూ ఓ యువకుడు ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో వైరల్ కాగా, చూసిన ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది.
పోలీసుల వేధింపులు... నంద్యాల జిల్లా నంద్యాల - గాజులపల్లె రైల్వే లైన్ పై గోపవరం వద్ద రైలు కిందపడి చినబాబు అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు నంద్యాల తోటలైను వీధికి చెందినవాడు. ఆత్మహత్యకు ముందు యువకుడు తీసిన సెల్ఫీ వీడియో వైరల్ అవుతోంది. సంబంధం లేని ఓ ద్విచక్ర వాహనం చోరీ కేసులో తనను ముద్దాయిగా చేశారని..నంద్యాల ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ ఎస్ఐ, నాగన్న, ఏసుదాసు కానిస్టేబుళ్లు వేధించారని సెల్ఫీలో తెలిపాడు. చోరీ చేసిన వ్యక్తి తన లాగే ఉన్నందుకు నేరం ఒప్పుకోవాలని బెదిరించినట్లు వివరించాడు. పోలీసుల వైఖరితో మనస్తాపానికి గురై రైలు కిందపడుతున్నట్లు తెలిపాడు.
తన బాధనంతా వ్యక్తం చేస్తూ.."హాయ్ ఫ్రెండ్స్.. ఈ వీడియో చూస్తున్నప్పటికి నేను ఉంటానో లేదో తెలియదు... ఉండను.. ఎందుకంటే నా మీద బండి దొంగతనం కేసు వేసినారు. అయినా, ఆ దొంగతనం నేను చేయలేదు. సీసీ కెమెరాలో దొరికిన చిన్న ఒక ఫొటో పట్టుకుని.. అందులో ఉన్నది నేను కాదు.. నేనే అని చెప్పి స్టేషన్‌కు తీసుకుపోయి కానిస్టేబుల్ నాగన్న అనే వ్యక్తి వన్ టౌన్ ఎస్ఐ మా ఏరియాలో ఉంటే ఏసుదాసు అనే కానిస్టేబుల్.. వీరు ముగ్గురూ కలిసి నేను చేయని నేరాన్ని ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. నిన్న అంతా స్టేషన్లోనే ఉంచారు. రాత్రంతా కొట్టారు.. ఇప్పుడు కూడా స్టేషన్‌కు రావాలన్నారు. కానీ, నేను స్టేషన్‌కు వెళ్తే నేరం చేశానని ఒప్పుకోవాలి. ఆ బండి ఎక్కడుందో కూడా నాకు తెలియదు.ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి ఫ్రెండ్స్..? చేయని నేరాన్ని నేను ఎందుకు ఒప్పుకోవాలి..? అందుకే నేను ఒప్పుకోను. చచ్చిపోదామని రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చా.. ఎస్ఐ గారు కొట్టే కొట్టుడు ఏమో గానీ, అమ్మ, అక్కని తిడుతున్నాడు. చేయని తప్పునకు ఎవరు ఫ్రెండ్స్.. దెబ్బలు తినేది, తిట్లు తినేది..? ఎట్లా చెప్పండి. ఇప్పుడు కూడా నేను టిఫిన్ చేసి స్టేషన్ దగ్గరకు వెళ్లాలి. కానీ, నా వల్ల కాదు. మా ఏరియా మొత్తం నేను దొంగ అని అనుకుంటున్నారు.. దొంగతనం అంటేనే నచ్చదు మనకు.. అట్లాంటిది దొంగతనం కేసు మీదేస్తే ఎట్లా ఫ్రెండ్స్..? బై టు ఆల్.. మమ్మీ.. సారీ మమ్మీ.." అంటూ తన ఆవేదనను సెల్ఫీ వీడియో ద్వారా పంచుకున్నాడు.
మరోవైపు రెండు సంవత్సరాల క్రితం అదే పట్టణంలో.. అదే పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటనే జరిగింది. 2020 నవంబర్ మూడో తేదిన నంద్యాలకు చెందిన ఆటోడ్రైవర్ అబ్దుల్ సలామ్ కుటుంబం పోలీసుల వేధింపుల భరించలకే రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో పెద్ద కలకలంరేపింది. దొంగతనం కేసులో నేరం ఒప్పుకోలంటూ పోలీసులే ఒత్తిడి చేస్తున్నారంటూ అబ్దుల్‌సలాం తీసిన సెల్ఫీ వీడియో ఆ తర్వాత బయటపడింది. ఈ ఘటనలో అప్పటి వన్‌టౌన్ CI సోమశేఖర్‌రెడ్డితో పాటు హెడ్‌కానిస్టేబుల్ గంగాధర్‌ను పోలీసుశాఖ సస్పెండ్ చేసి అరెస్ట్ చేసింది.