తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గంట 40 నిమిషాలు నీటిపై తేలుతూ ఈ యువకుడి యోగాసనాలు.. మీరు చూశారా? - International Book of Records in Water acrobatics

YOUNG MAN YOGA ON WATER: ప్రాణం ఉన్న మనిషి నీటిపై తేలుతూ ఉండాలంటే ఈత కొట్టాలి. కానీ అతడు అలా కాదు. కాళ్లు చేతులు ఆడించకుండా గంటకు పైగా నీటిపై తేలుతున్నాడు. అంతేకాక తాను నేర్చుకున్న విద్యతో నీటిపై పలు ఆసనాలు వేస్తూ.. ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు ఆ నంద్యాల యువకుడు. కానీ, మరింత ముందుకు వెళ్లేందుకు ఆర్థిక సమస్యలు తనకు అడ్డంకిగా మారాయి. మరి ఆ యువకుడు ఏం చేసి రికార్డుల్లోకెక్కాడు? కష్టాల నుంచి గట్టెక్కడానికి తను ఆశిస్తున్న సహాయ, సహకారాలు ఏమిటి? ఇప్పుడు చూద్దాం..

JALA PLAVANI VIDYA
JALA PLAVANI VIDYA

By

Published : Mar 24, 2023, 12:26 PM IST

Updated : Mar 24, 2023, 12:38 PM IST

జలప్లావని విద్య.. నీటిపై తేలుతూ యువకుడి యోగాసనాలు.. ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు

YOUNG MAN ACROBATICS ON WATER: చిన్నప్పటి నుంచి కచ్చితంగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందాలనుకున్నాడు. అలా యుక్త వయస్సు వచ్చాక ధ్యానం, యోగా వైపు ఆకర్షితుడయ్యాడు ఈ యువకుడు. తర్వాత తాను నేర్చుకున్న విద్యతో ప్రపంచ రికార్డు సృష్టించాలని నిర్ణయించుకుని సాధన చేశాడు. తన కఠోర దీక్షకు ఫలితంగా ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు.

ఉపేంద్రం సుభాకర్ రాజు.. నంద్యాల జిల్లా బేతంచర్ల వాసి. పేద కుటుంబంలో పుట్టిన ఈ యువకుడికి పసిప్రాయం నుంచి ఏదైనా సాధించాలనే కోరిక ఉండేది. మదనపల్లెలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో 2018లో ఇంజనీరింగ్ చేశాడు. తరువాత పలు కంపెనీల్లో పనిచేసినా.. తన ఆర్థిక సమస్యల వల్ల ఇంకా ఏదైనా చేయాలనే కసి పెరిగిందంటున్నాడు.

'నాది డిప్లోమా మెకానికల్​ ఇంజనీరింగ్​ అయిపోయింది. ఆ తర్వాత చాలా చోట్ల ఉద్యోగాలు చేశాను. ఇప్పుడు హైదరాబాద్​లో చేస్తున్న. చిన్నపాటి చాలా ఇబ్బందులు పడ్డాను. ఏదో ఒకటి చేయాలని అప్పుడే ఫిక్స్​ అయ్యాను. 2014 రాజమండ్రి పుష్కరాల్లో యోగానంద భారతీ స్వామి వారు జల ప్లావని విద్యను ప్రదర్శించినట్లు నా ఫ్రెండ్ చెప్పాడు. కానీ దాన్ని నేను నమ్మలేదు. అప్పుడు పేపర్లో వచ్చిన వాటిని చూసి నమ్మి నేను కూడా ఈ విద్యను నేర్చుకోవాలని అనుకున్నాను. అప్పుడే ఎలా చేయాలి అనే అన్ని వివరాలను గురువు గారి దగ్గరికి వెళ్లి నేర్చుకున్నాను"-ఉపేంద్రం సుభాకర్ రాజు

2014 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మోదీ దేశ ప్రధాని కావాలని కోరికతో యోగా గురువు యోగానంద భారతి స్వామి.. రాజమహేంద్రవరంలోని గోదావరిలో తేలియాడుతూ 'జల ప్లావని' విద్య ప్రదర్శించారు. ఇది దినపత్రికల్లో ప్రచురితం కావడంతో సుభాకర్ మొదటి సారి దీని గురించి తెలుసుకున్నాడు. యోగానంద భారతిని స్ఫూర్తిగా తీసుకుని జల ప్లావని విద్య నేర్చుకోవాలని అనుకున్నాడు. ఆయన చిరునామా తెలుసుకుని విజయనగరం జిల్లా గంగచోళ పెంటలోని జ్ఞానానందాశ్రమానికి వెళ్లాడు. అక్కడ ధ్యానం, యోగాపై శిక్షణ పొందానంటున్నాడు సుభాకర్‌ రాజు.

"నా కాలేజ్​ లైఫ్​ నుంచి ధ్యానం చేసుకోవడం మొదలుపెట్టాను. అందువల్ల జలప్లావనిలో నాకు ఇబ్బంది అనిపించలేదు. ఏది చేయాలన్నా శ్వాస మీదనే ఆధారపడి ఉంటుంది. ఇక అప్పటి నుంచి ప్రాక్టీస్​ చేయడం మొదలుపెట్టాను. అలా ఇంటర్నేషనల్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో 1గంట 40 నిమిషాలు చేసి చోటు సంపాదించా"-ఉపేంద్రం సుభాకర్ రాజు

గురువు చెప్పిన విధంగా తాను శిక్షణ పొందాడు. చెప్పినవన్నీ తూ.చ తప్పకుండా పాటించడం వల్లే తనకు జల ప్లావని విద్య అబ్బిందంటున్నాడు. శ్వాసను మన అధీనంలో ఉంచుకోగలిగేందుకు గురువు చెప్పిన సూచనలు ఉపయోగపడ్డాయని చెబుతున్నాడు. శ్వాసపై ధ్యాస ఉంచి ఏకాగ్రతతో మనస్సు, శరీరాన్ని తేలిక చేసి నీటిపై 2 గంటలపాటు తేలియాడటంలో ప్రావీణ్యం సంపాదించాడు. అలా హైదరాబాద్‌లో 2022 డిసెంబరు 28న నిర్వహించిన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పోటీల్లో సుభాకర్ రాజు పాల్గొన్నాడు. గంట 40 నిమిషాల పాటు నీటిపై తేలియాడి కఠినమైన పద్మాసనాన్ని ప్రదర్శించి.., ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ ను కైవసం చేసుకున్నారు. గిన్నిస్ రికార్డ్స్‌లో స్థానమే తన తర్వాత లక్ష్యమని చెబుతున్నాడీ యువకుడు.

పేద కుటుంబం కావడం వల్ల ఇప్పటికీ ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా భవిష్యత్‌లో దేశానికి మరిన్ని రికార్డులు సాధించడమే తన ధ్యేయమంటున్నాడు. తను చేసిన ఈ ఫీట్‌ను చూసి వైద్య నిపుణులు సైతం సుభాకర్ రాజును అభినందిస్తున్నారు. శ్వాసను గంటపాటు నియంత్రించుకుంటూ, నీటిపై యోగాసనాలు వేయడం గొప్ప విషయం అంటున్నారు. తమ కుమారుడు ఈ ఫీట్‌ సాధించడం పట్ల సుభాకర్ రాజు తండ్రి ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఇంతటి ప్రతిభ కలిగి ఉండి , ఆర్థికంగా బలంగా లేక చాలా విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కున్నానంటున్నాడు సుభాకర్ రాజు. ప్రభుత్వం లేదా దాతల నుంచి ఆర్థికంగా సహకరిస్తే మరింత ముందుకు సాగుతానని విజ్ఞప్తి చేస్తున్నాడు.

"మా అబ్బాయి సాధిస్తాడని నేను అనుకోలేదు. మేము వద్దని చెప్పినా వినలేదు. ఈరోజు పట్టుదలతో సాధించాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. కొంచెం ప్రభుత్వం కూడా సాయం చేయాలని కోరుతున్నా"-సుబ్రహ్మణ్యరాజు, సుభాకర్ రాజు తండ్రి

ఇవీ చదవండి:

Last Updated : Mar 24, 2023, 12:38 PM IST

ABOUT THE AUTHOR

...view details