ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వినూత్న పర్యటనను చేపట్టారు బైక్ రైడర్ దురియా తపియా. ట్రక్ రైడ్‌తో దేశం మొత్తం పర్యటించి ఆత్మనిర్భర్ భారత్, స్వచ్ఛ భారత్, తదితర పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. కరోనా పైనా ప్రజల్లో అవగాహన పెంచనున్నారు. జనవరి 26న దురియా.. ఈ పర్యటనను గుజరాత్ సూరత్ నుంచి ప్రారంభించారు.
బైక్ రైడర్ టూ ట్రక్ డ్రైవర్
ట్రక్కు నడుపుతున్న దురియా తపియా గుజరాత్ సూరత్‌కు చెందిన 42ఏళ్ల దురియా తపియాకు బైక్ రైడర్‌గా మంచి గుర్తింపు ఉంది. గతంలో దురియా.. సింగపూర్‌కు బైక్ రైడ్ చేశారు. దేశవ్యాప్తంగా ట్రక్ రైడ్ చేయాలన్న ఉద్దేశంతో మూడు నెలలు కష్టపడి ట్రక్ డ్రైవింగ్ నేర్చుకున్నారు. ఆర్టీఓ కార్యాలయంలో లైసెన్స్ పొందారు.
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే..
భారత్ మొత్తం ట్రక్కు రైడ్!... ఎందుకంటే? కేంద్రం ప్రవేశపెట్టే చాలా పథకాలు గ్రామీణ ప్రాంత ప్రజల వరకు చేరటం లేదని, దీనికి కారణం వారికి వాటిపై అవగాహన లేకపోవడమేనని భావించిన దురియా.. తన పర్యటనతో ప్రజల్లో అవగాహన పెంచి.. వారిలో చైతన్యం నింపాలనుకున్నారు. 10వేల కిలోమీటర్లను 35 రోజుల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో, 4,500 గ్రామాల్లో పర్యటించనున్నారు.
కొవిడ్-19పైనా అవగాహన
ఆత్మనిర్భర్ భారత్, స్వచ్ఛ భారత్ లాంటి పథకాలతోపాటు కరోనా పైనా అవగాహన కల్పించనున్నారు దురియా. గ్రామ ప్రజలకు ఉచితంగా మాస్కులు, శానిటైజర్లు, చెత్త బుట్టలను పంపిణీ చేయనున్నారు. ఓ మహిళ ట్రక్‌ను నడుపుకుంటూ హైవేపై వెళ్తుండటం మహిళలకు గర్వకారణమని దురియా అన్నారు.
ఇదీ చదవండి :జంతు చర్మాలు ఇంట్లో దాచిన వ్యక్తి అరెస్ట్