తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది!' - adithi

Woman Hates Marriage: ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది! సొంత కాళ్లపై నిలబడింది! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది. ఎదిగే సమయంలోనే వివాహ బంధం మీద నమ్మకం పోయింది. ఎదిగిన తర్వాత సమాజం అంతా ఒక బూటకం అనిపించింది. చివరికి ఒక పసిపాప నవ్వు ఆమెలో ఒక కొత్త ఆశని రేకెత్తించింది. ఆ ఆశతోటే.. మిగిలిన జీవితం ఒక తల్లిగా గడపాలనుకుంటోంది. ఆమె హృదయరాగం ఒకసారి వినండి..!

a woman hates marriage but wants to be a mother
a woman hates marriage but wants to be a mother

By

Published : Jan 5, 2022, 4:31 PM IST

Woman Hates Marriage: ''వాన కురిసి కలిసేది వాగులో, వాగు వంక కలిసేది నదిలో, కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో. కానీ ఆ కడలి కలిసేది ఎందులో.. ఎవరికెవరు ఈలోకంలో ఎవరికి ఎరుక.. ఏదారెటు పోతుందో ఎవరినీ అడగకా..''. ఈ పాట విన్నప్పుడల్లా నా జీవితం నాకు కళ్లకి కట్టినట్లు కనిపిస్తుంది. నా పేరు అదితి! అంటే స్వేచ్ఛకి మారుపేరు. కానీ నా సగం జీవితం ముగిసేవరకు కూడా స్వేచ్ఛ అంటే ఏంటో నాకు తెలియలేదు. ఇప్పుడు నాకు 35 ఏళ్లు. ఒక్కసారి వెనక్కి తిరిగి నా జీవితాన్ని చూసుకుంటే.. ఏ ఆధారం లేని గాలిపటంలా, ఎటువైపు వెళుతుందో తెలియని వాగులా నా ప్రయాణం సాగింది.

.

నాకప్పుడు అయిదేళ్లు. నాన్న ఎప్పుడూ నాన్నలా కాకుండా ఒక చుట్టంలా ఇంటికి వచ్చేవాడు. వచ్చినప్పుడు కూడా తిన్నగా నిలబడలేకపోయేవాడు. అంతలా తాగుడికి బానిసయ్యాడు. ఒకరోజు అర్థరాత్రి నేను గాఢ నిద్రలో ఉన్నా కూడా అమ్మా నాన్నల అరుపులు మటుకు గట్టిగా వినిపించసాగాయి. తర్వాత నాన్న నుండి ఆ చుట్టపు చూపు కూడా కరువైంది. అంతా నిశ్శబ్దం ఆవహించిన నా జీవితంలో కొంత ఊరట కలిగించింది కుసుమక్క నవ్వు! నాతో ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడినా.. ఆమె నవ్వులో తెలియని నటన ఉండేది. ఆ నవ్వు వెనుక ఏదో తెలియని బాధ దాగుందనిపించేది. తనని నేను అర్థం చేసుకోగలను.. ఎందుకంటే ఆమె నా బాబాయి కూతురు. వయసులోనే బాబాయి నాన్నకంటే చిన్న, చెడు అలవాట్లలో మటుకు నాన్నని మించిపోయాడు.

.

కొన్ని నెలల తర్వాత అమ్మమ్మ తరఫువాళ్లు తరచూ ఇంటికి రావడం మొదలుపెట్టారు. వారి నవ్వులో నాకు ప్రేమ కనిపించేది కాదు. జాలి మాత్రమే ఉండేది. కొంతకాలానికి ఇంట్లో ఎక్కడలేని హడావుడి మొదలైంది. అమ్మలో, బంధువుల్లో ఏదో తెలియని ఉత్సాహం. దాన్నే పెళ్లి అంటారని నాకు అప్పుడు తెలియదు. అమ్మకి రెండో పెళ్లి జరిగింది. తర్వాత ఏడాదికే తమ్ముడు పుట్టాడు. అమ్మ ప్రేమలో తేడా వచ్చింది ! అన్నిట్లో తమ్ముడు నాకంటే ఎక్కువే.. అమ్మ ప్రేమలో కూడా.. ! ఇప్పటివరకు అమ్మ పక్కన ఉందనే చిన్న ధైర్యం ఉండేది. అప్పటి నుండి నేను పూర్తిగా ఏకాకినైపోయాను..! మొదటిసారి దేవుడు గుర్తొచ్చాడు.. కోపం వచ్చింది! ఎదురుగా ఉంటే కొట్టాలనిపించింది. కానీ ఈ బాధ నా ఒక్కదానిదేనా? నా లాంటివారు ఈ సమాజంలో లేరా ? అనే ఆలోచన నన్ను మనుషుల గురించి లోతుగా విశ్లేషించేలా చేసింది!

.

'ఒకరి మీద ఆధారపడితే ఈ సమాజం వెక్కిరిస్తుంది, అదే సొంతకాళ్లపై నిలబడితే నోరు మూసుకుంటుంది' అని అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. అందుకు కారణం కుసుమక్క! బాబాయి వాళ్లు బలవంతంగా ఆమెకు ఇష్టం లేని పెళ్లి చేశారు. ఎప్పటిలాగే కుసుమక్క నవ్వుతో బాధని మింగేస్తోంది. నా జీవితం అలా కాకూడదనిపించింది. అందుకే కష్టపడి చదివాను, మంచి ఉద్యోగంతో నా కాళ్లపై నేను నిలబడగలిగాను. ఇప్పుడు నేను ఎడారిలో నావను కాను, నదిలో చేపను, పంజరం నుండి బయటికి వచ్చిన స్వేచ్ఛా జీవిని.

కానీ ఈ సమాజం స్త్రీకి కొన్ని లెక్కలు వేసి పెట్టింది. స్త్రీకి పరిపూర్ణత్వం చేకూర్చేది పెళ్లే అని నిర్ధరించింది. అసలు నేనెందుకు పెళ్లి చేసుకోవాలి? అమ్మలా స్వార్థం చూసుకోవడానికా? కుసుమక్కలా రాజీపడి బతకడానికా? ఈ సమాజంలో వీరిలా ఉంటేనే బతకగలమా? ఇలా ఒక పార్కులో కూర్చొని ఆలోచనల పాతాళానికి వెళ్లిన నేను ఒక అలజడితో ఈ లోకంలోకి వచ్చాను. ఆ అలజడి రేపింది ఒక పసిపాప. నవ్వుతూ నా కొంగు పట్టుకుని లాగుతోంది. ఎంత చక్కటి నవ్వు! ఎంత స్వచ్ఛమైన నవ్వు! ఆ నవ్వు వెనుక జాలి లేదు, స్వార్థం లేదు, బాధ లేదు! ఏదో తెలియని ఆనందం! ఇదే కదా నేను ఇన్ని రోజులు కోల్పోయింది! ఇదే కదా నాకు ఇప్పుడు కావాల్సింది! అందుకే అప్పటికప్పడు నిర్ణయించేసుకున్నా! అవసరాల ముసుగు వేసుకునే ఈ పెళ్లి నాకు వద్దు! కానీ అమ్మతనం మటుకు నాకు కావాలి! అందుకు సరోగసిని ఎంచుకోవాలనుకుంటున్నా! దాని కోసం ఎంతటి న్యాయపోరాటానికైనా సిద్ధమే.. నా ఈ నిర్ణయం సరైనదే అనుకుంటున్నా! మీరేమంటారు?

.

- ఇట్లు, అదితి

ఇవీ చూడండి:ప్రతిరోజు ఆమెదే.. స్త్రీ విలువ తెలుసుకో.!

స్త్రీ సాధికారతను చిదిమేస్తున్న పురుషాధిక్యత

ఆడపిల్ల అని తెలియగానే.. పేగుబంధాన్ని తెంచేస్తున్న తల్లి!

ABOUT THE AUTHOR

...view details