తమిళనాడుకు చెందిన ఓ మహిళ తన రూ.2 కోట్ల విలువచేసే ఆస్తిని క్యాన్సర్ ఆస్పత్రికి పేరిట రాసేశారు. క్యాన్సర్ మహమ్మారి కారణంగా ఆ మహిళ కుటుంబం మొత్తం ఒకరు తర్వాత ఒకరు మరణించారు. కుటుంబంలో అందరూ దూరమై చివరికి ఆమె ఒక్కరే మిగిలారు. అయితే ఫిబ్రవరి 17న ఆమె కుడా మరణించింది. చనిపోయే ముందు అధికారులను ఉద్దేశించి ఆమె ఓ లేఖ రాశారు. అందులో తన పేరు మీద ఉన్న దాదాపు రూ.2 కోట్ల విలువైన ఆస్తులను ఓ క్యాన్సర్ ఆస్పత్రికి అందించాలని కోరారు.
తిరువళ్లూర్ జిల్లాలోని ఆవడి కామరాజ్ ప్రాంతానికి చెందిన సుందరీబాయ్ అనే మహిళ కుటుంబంలో అందరూ.. క్యాన్సర్ కారణంగా మృతిచెందారు. ఒక్కొక్కరూ మృతిచెందగా.. చివరికి అక్క జానకి, సుందరీబాయ్ మాత్రమే మిగిలారు. సుందరీబాయ్ తన ఇంట్లో పదికి పైగా పిల్లులను పెంచుకుంటున్నారు. అయితే ఫిబ్రవరి 15న సుందరీబాయ్ సోదరి జానకి కూడా క్యాన్సర్ మహమ్మారి కారణంగా మరణించారు. సోదరి మృతితో ఒంటరిగా మిగిలిన సుందరీబాయ్ కూడా ఫిబ్రవరి 17న మృతి చెందింది. అయితే సుందరీబాయ్ తాను చనిపోవడానికి ముందు ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి ఓ లేఖ రాశారు. తన పేరుమీద ఉన్న దాదాపు రూ.2 కోట్ల ఆస్తులను కాంచీపురం అరిజార్ అన్నా క్యాన్సర్ ఆస్పత్రికి అందించాలని కోరారు.
"నా ఇల్లు, 54 సవర్ల బంగారం, బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.61 లక్షలు, పోస్టాఫీసులో ఉన్న డబ్బులను అన్నా కేన్సర్ ఆస్పత్రికి అందజేయండి. అలాగే అందులోంచి కొంత మొత్తాన్ని మా ఎదురింటి వాళ్లకు, ఆటోడ్రైవర్‌కు ఇచ్చి నా అప్పు తీర్చండి. నా ఇంట్లో పదికిపైగా పిల్లులు ఉన్నాయి. దయచేసి వాటిని రక్షించండి" అని సుందరీబాయ్ లేఖలో పేర్కొన్నారు. దీంతో ఆమె కోరిక మేరకు ఆవడి పోలీసులు, గ్రామ పరిపాలనా అధికారులు కలిసి సుందరీబాయ్ పేరుమీద ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. వారు సుందరీబాయ్ ఇంటిని తాళం వేసి సీల్ చేశారు. అయితే మార్చి 18న సుందరీబాయ్ పేరు మీద ఉన్న ఆస్తి పత్రాలను, 54 సవర్ల బంగారు ఆభరణాలు, బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును, ఆధార్, రేషన్ కార్డులను జిల్లా డిప్యూటీ కలెక్టర్ సెంథిల్ ఆధ్వర్యంలో.. తిరువళ్లూర్ ట్రెజరీ కార్యాలయంలో భద్రపరచారు.
వారికి మాత్రం నా ఆస్తి దక్కకూడదు.. అందుకే!
ఇలానే గతంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ వృద్ధుడు కూడా తన ఆస్తిని కలెక్టర్ పేరు మీద రాశారు. సొంత కుటుంబసభ్యులే అతన్ని ఇంట్లోనుంచి తరిమేశారు. దీంతో తనని పట్టించుకనే నాధుడే లేక ఒంటరిగా కాలం వెళ్లదీస్తున్నారు. అయితే ఎట్టిపరిస్థితుల్లో తన పేరు ఉన్న ఆస్తిని తన కుటుంబసభ్యులకు దక్కుకూడదని భావించాడా ఆ వృద్ధుడు. దీంతో తన పేరుఉన్న రూ.2 కోట్లు విలువైన భూమిని కలెక్టర్ పేరుమీద రాశాడు.ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.