ఓ పూట ఆహారం తీసుకోకుండానైనా ఉంటామేమో గానీ మొబైల్స్, ల్యాప్‌టాప్స్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేం. ఇదీ డిజిటల్ ప్రపంచంలో మునిగితేలుతోన్న నేటి యువత వరుస. ఇలా రోజుకు 6 నుంచి 8 గంటలపాటు మొబైల్లోనే యువత కాలం గడుపుతున్నారనటంలో అతిశయోక్తి లేదు. ఎక్కువ సమయం గ్యాడ్జెట్స్ వినియోగించటం వల్ల విద్యార్థులు, యువతీయువకుల్లో మెడనొప్పి, నడుంనొప్పి, కళ్ల సమస్యలతోపాటు మానసిక ఒత్తిడి, ఆందోళన అధికమవుతున్నాయి.
ఈ క్రమంలో యువతను డిజిటల్ ప్రపంచానికి దూరంగా(డిజిటల్ డీటాక్స్) ఉంచేందుకు గుజరాత్ అహ్మదాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో డిజిటల్ డీటాక్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. మొబైల్ వ్యసనానికి బానిసలైన చిన్నారులు, యువతీయువకులకు ఈ సెంటర్లో ఉచితంగా చికిత్స అందిస్తున్నారు.
డిజిటల్ డీటాక్స్ అంటే ఏమిటి?
డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉండటం. మొబైల్, సామాజిక మాధ్యమాల వినియోగాన్ని క్రమంగా తగ్గించుకోవటం.
ఎవరు డీటాక్స్ సెంటర్‌కు వెళ్లేందుకు అర్హులు?
వీటిలో ఏ రెండు సమస్యలతో బాధపడుతున్నా మీరు కచ్చితంగా డిజిటల్ డీటాక్స్ సెంటర్‌ను సందర్శించాలి.
1. మొబైల్ ఫోన్ లేకుండా మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లలేకపోవటం
2. ఎలాంటి కారణం లేకపోయినా అదే పనిగా మొబైల్‌ను చెక్ చేయటం
3. ఆహారం తీసుకునేటప్పుడు కూడా మొబైల్ ఫోన్ వాడటం
4. సామాజిక మాధ్యమాలను సందర్శించిన తర్వాత ఆత్రుత, డిప్రెషన్‌కు లోనవ్వటం
5. మెసేజెస్ లేదా కామెంట్స్ లేదా పోస్ట్‌లకు స్పందించాలన్న కోరిక బలంగా ఉండటం
6. మీరు ఒంటరిగా ఉన్నారని అనుకోవటం
" గుజరాత్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఈ మానసికో ఆరోగ్య ఆసుపత్రిలో 'డిజిటల్ వెల్నెస్ సెంటర్'ను ప్రారంభించాం. ఇక్కడికి వచ్చే రోగులకు వృత్తి చికిత్స, పునరావాస ప్రక్రియ చేపడతాం. 5-22 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలు, యువకులు చికిత్స కోసం మా దగ్గరికి వస్తుంటారు. వారిని ముందుగా సైకియాట్రిస్ట్‌కి చూపిస్తాం. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ క్లాసులకు హాజరవుతూ ఉండటం మూలాన పిల్లలు డిజిటల్ మీడియాకు బాగా అలవాటు పడిపోయారు. అది ఓ వ్యసనంలా మారింది. దీనివల్ల వారిలోని సహజ నైపుణ్యాలు ప్రభావితం అవుతున్నాయి."
-- విభా సలాలియా, సైకియాట్రిక్ హెడ్ నర్సు