స్కూటీపై వెళ్తున్న 66 ఏళ్ల వృద్ధుడు, అతడి మనవడిని ఓ లారీ డ్రైవర్ సుమారు 2 కిలోమీటర్ల వరకు ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఈ ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో శనివారం జరిగిందీ ఘటన.
మృతుల్లో ఒకరు విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉదిత్ నారాయణ్ చౌరాసియా. అతడి మనవడి వయసు ఆరు సంవత్సరాలు. అయితే శనివారం మార్కెట్‌కు వెళ్తుండగా బీజానగర్ మలుపు సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక పోలీస్ అధికారి రామ్ ప్రవేశ్ రాయ్ చెప్పారు. లారీ ఢీకొట్టిన వెంటనే వాహనంపై ఉన్న ఇద్దరితో పాటు స్కూటీ ట్రక్కు వెనక భాగంలో ఇరుక్కుపోయింది. దీన్ని గమనించని డ్రైవర్ దాదాపు 2 కిలోమీటర్ల వరకు అలాగే ఈడ్చుకెళ్లాడు.
కొందరు స్థానికులు లారీ కింద భాగంలో ఉన్న మృతదేహాల్ని చూసి.. ట్రక్కును వెంబడించి ఆపారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. శవపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. లారీని సీజ్ చేశారు.
ఒకే కుటుంబంలోని నలుగురు.. గర్భిణీతో సహా..
కర్ణాటక హాసన్ జిల్లాలో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను బైక్‌పై వెళ్తున ఓ కుటుంబం ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడిక్కక్కడే మృతి చెందారు. వీరిలో భార్యాభర్తలతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, మరణించిన మహిళ గర్భంతో ఉన్నట్లు తెలుస్తోంది. మృతులను లోకేశ్ ఆచారి, అతడి భార్య లక్ష్మి, కుమార్తెలు లేఖన, గానవిగా గుర్తించారు పోలీసులు.
పోలీసుల కథనం ప్రకారం..నవిలే గేట్ గ్రామానికి చెందిన లోకేశ్ ఆచారి 12 ఏళ్ల క్రితం లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి సంతానం లేకపోవడం వల్ల లోకేశ్ తన సోదరి కుమార్తెలను దత్తత తీసుకొని పెంచుకుంటున్నాడు. అతడి భార్య లక్ష్మి మూడు నెలల క్రితమే గర్భం దాల్చింది. ఈ క్రమంలో లోకేశ్ తన భార్య పిల్లలతో కలిసి హోసూర్‌లోని తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరై స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న నగ్గెహళ్లి పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. ఎటువంటి సైన్ బోర్డు లేకుండా ఉన్న ప్రదేశంలో ట్రాక్టర్ నిలపడమే ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు పోలీసులు. ఈ ఘటనపై మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.