కిసాన్ గణతంత్ర పరేడ్ పేరిట దిల్లీలో రైతులు చేపట్టిన ప్రదర్శన హింసకు దారితీసింది. కొందరు రైతులు అనుమతించిన మార్గంలో కాకుండా రాజ్‌పథ్‌కు వెళ్లేందుకు ప్రయత్నం చేయడం వల్ల వివిధ ప్రాంతాల్లో పోలీసులు, కర్షకులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. చారిత్రక ఎర్రకోటలోకి ప్రవేశించిన కొందరు నిరసనకారులు సిక్కు ఆధ్యాత్మిక జెండాలను కోట బురుజులపై ఎగరవేశారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు కొన్ని చోట్ల పోలీసులు లాఠీఛార్జి చేసి, బాష్పవాయుగోళాలు ప్రయోగించగా, కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకారులే పోలీసులు, వారి వాహనాలపై దాడిచేశారు.
రెండు నెలలకుపైగా దిల్లీ సరిహద్దుల్లో సాగుచట్టాలకు వ్యతిరేకంగా శాంతియుత ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీతో హస్తిన రణరంగాన్ని తలపించింది. కిసాన్ గణతంత్ర పరేడ్ ట్రాక్టర్ల ర్యాలీ శాంతియుతంగా మొదలై హింసాత్మకంగా మారింది. త్రివర్ణపతాకాలు, రైతుసంఘాల జెండాలతో ట్రాక్టర్లను అలంకరించిన రైతులు సింఘు, ఘాజీపుర్, టిక్రీ సరిహద్దుల నుంచి దిల్లీ దిశగా నిర్ణీత సమయం కంటే ముందే ర్యాలీని కదిలించారు. పలు ప్రాంతాల్లో స్థానికులు అన్నదాతలపై పూలవర్షం కురిపించారు. అయితే కొంత సేపటికే పరిస్థితి మారిపోయింది. గణతంత్ర వేడుకలు ముగియకుండానే ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభించడంతో పలుచోట్ల పోలీసులు అడ్డుకున్నారు.
రూటు మారింది.. హింస చెలరేగింది..
అనుమతి ఇచ్చిన మార్గంలో కాకుండా కొంతమంది రైతులు వేరే మార్గంలోకి వెళ్లడంతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అక్షర్‌ధామ్ వద్ద రైతులపై లాఠీఛార్జి చేసిన పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. సంజయ్ గాంధీ ట్రాన్స్‌పోర్ట్ నగర్‌లో పోలీసులు తెచ్చిన వాటర్ కెనాన్ వాహనంపైకి ఎక్కిన నిరసనకారులు కర్రలతో దాడి చేశారు. కర్నల్ బైపాస్ వద్ద ర్యాలీని అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్లను ఆందోళనకారులు కర్రలతో తొలిగించారు. ముకర్బాచౌక్ వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగిన నిరసనకారులు పోలీస్ వాహనంపైకి ఎక్కి అద్దాలు ధ్వంసంచేశారు. నంగ్లోయి ప్రాంతంలో పరిస్థితి యుద్ధవాతావరణాన్ని తలపించింది. నిరసనకారులను అడ్డుకునేందుకు తొలుత పోలీసులు రహదారిపై బైఠాయించారు.
ఆందోళనకారులు పదేపదే ముందుకువెళ్లేందుకు యత్నించగా నంగ్లోయి వద్ద లాఠీఛార్జ్ చేశారు. భాష్పవాయుగోళాలు ప్రయోగించి చెదరగొట్టారు. మరోవైపు అనుమతి ఇచ్చిన మార్గంలో కాకుండా రాజ్‌పథ్‌వైపు వెళ్లేందుకు కొందరు ఐటీవోలోని పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద బారీకేడ్లను తొలగించేందుకు చేసిన యత్నం హింసాత్మకంగా మారింది. అడ్డుకునేందుకు డీటీసీ బస్సును అడ్డుపెట్టగా బస్సు, పోలీసు వాహనాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. పోలీసులపై దాడికి యత్నించారు. వారిని నియంత్రించే క్రమంలో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.లాఠీఛార్జ్ చేశారు.
రైతు మృతి.. ఎర్రకోటపై జెండా
ఈ క్రమంలోనే ఓ రైతు చనిపోగా ట్రాక్టర్ బోల్తాపడి చనిపోయాడని పోలీసులు తెలిపారు. పోలీస్ బుల్లెట్ వల్లేనని నిరసనకారులు ఆరోపించారు. ఐటీఓ నుంచి రాజ్‌పథ్‌కు వెళ్లడం సాధ్యం కాకపోవడంతో కొందరు నిరసనకారులు ఎర్రకోటలో ప్రవేశించారు. నిహంగాలుగా పిలిచే కొంతమంది సిక్కులు ట్రాక్టర్లతో పాటు ఎర్రకోటలోకి ప్రవేశించి కోట గుమ్మటాలపై సిక్కుల త్యాగాలకు ప్రతీకగా భావించే జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి త్రివర్ణపతాకం ఎగరవేసే చోట జెండాను ఎగరేశారు. మరికొంతమంది రైతు సంఘాల జెండాలను ప్రదర్శించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎర్రకోట నుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నించిన పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. అతికష్టంపై ఆందోళనకారులను ఎర్రకోట నుంచి పోలీసులు ఖాళీ చేయించారు. రైతు సంఘాల నేతల పిలుపుతో కొత్త సాగుచట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రెండు నెలల నుంచి ఆందోళన చేస్తున్న ప్రాంతాలకు తిరుగుపయనమయ్యారు.
'షా' సమీక్ష.. ఇంటర్నెట్ సేవలు బంద్..