సాధారణంగా ఏ ఉద్యోగి అయినా, పదవి విరమణ పొందగానే.. ఇంట్లోనే హాయిగా కూర్చొని సేద తీరుతూ మనవళ్లు.. మనవరాళ్లతో ఆడుకుంటూ కాలం గడపడాలని భావిస్తారు. చాలా మంది అలాగే చేస్తుంటారు. కానీ, 61 ఏళ్ల లోకేశ్ శరణ్ అలా అనుకోలేదు. టీచర్‌గా ఉద్యోగం చేసినప్పుడు ఎంతో మందిని భావిపౌరులుగా తీర్చి దిద్దిన ఆయన.. వృద్ధాప్యంలోనూ అదే పనిని కొనసాగిస్తున్నాడు. తన తండ్రి ఏర్పాటు చేసిన పాఠశాల మూతపడగా.. తన ఇంటి వాకిలినే పాఠశాలగా మార్చేశాడు. ఫీజులు కట్టి చదవుకోలేని పేద విద్యార్థుల నుంచి కేవలం ఒక్క రూపాయి ఫీజుగా తీసుకొని వారికి చదువు చెబుతున్నాడు.
1983లో..
బిహార్‌లోని సమస్తిపూర్‌కి చెందిన లోకేశ్ శరణ్.. టీచర్‌గా పనిచేసి పదవి విరమణ పొందాడు. ఆయన తండ్రి కూడా ఒకప్పుడు టీచర్‌గా పనిచేసి.. 1983లో సొంతంగా బాల సైనిక్ విద్యాలయం పేరుతో పాఠశాల ఏర్పాటు చేశారు. బీఎడ్ పూర్తి చేసిన శరణ్ తన తండ్రి పాఠశాలలోనే విద్యార్థులకు పాఠాలు చెప్పేవాడు. ఈ క్రమంలో పేద విద్యార్థులు.. చదువుకు నోచుకోలేని చిన్నారులపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి సైతం నివేదిక ఇచ్చారు. ఆయన అధ్యయనాలు, కథనాలు మెచ్చి ఓ పత్రిక యాజమాన్యం అతడిని జర్నలిస్టుగా నియమించుకుంది. దీంతో చాలా కాలం సొంత బడిలో టీచర్‌గా.. ఒక పత్రిక విలేకరిగా వ్యవహరిస్తూ వచ్చారు. వారి పాఠశాలలో విద్యార్థుల నుంచి తక్కువ ఫీజులు తీసుకోవడం వల్ల ఎక్కువ మౌలిక వసతులు కల్పించలేకపోయారు. దీంతో తల్లిదండ్రులు వారి బిడ్డలకు అన్ని వసతులున్న మంచి పాఠశాలల్లో చేర్పించడానికి మొగ్గుచూపారు. ఈ క్రమంలో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. కొన్నేళ్ల కిందట పాఠశాల పూర్తిగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.