కొవిడ్ తొలి ఉద్ధృతి సమయంలో భారతీయులు యాంటీబయోటిక్ ఔషధాలను మితిమీరి ఉపయోగించారని తాజా అధ్యయనమొకటి తేల్చింది. గత ఏడాది జూన్ నుంచి సెప్టెంబరు మధ్య భారత్లో వయోజనులకు సంబంధించి 21.64 కోట్ల యాంటీబయోటిక్ డోసులు, 3.8 కోట్ల అజిత్రోమైసిన్ డోసులు అధికంగా అమ్ముడుపోయినట్లు నిర్ధారించింది. ఆ నాలుగు నెలల్లో దేశంలో మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్న సంగతిని గుర్తుచేసింది. అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు.. 2018 జనవరి నుంచి 2020 డిసెంబరు వరకు భారత్లో ప్రైవేటు రంగంలో నెలలవారీగా యాంటీబయోటిక్ల విక్రయాలను విశ్లేషించడం ద్వారా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
గత ఏడాది దేశవ్యాప్తంగా 1,629 కోట్ల యాంటీబయోటిక్ డోసులు అమ్ముడుపోయినట్లు వారు తెలిపారు. వాస్తవానికి 2018, 2019తో పోలిస్తే ఈ సంఖ్య కొంత తక్కువేనని పేర్కొన్నారు. అయితే.. మొత్తం యాంటీబయోటిక్లలో వయోజనుల డోసులు 2018లో 72.6 శాతంగా, 2019లో 72.5 శాతంగా ఉండగా.. గత ఏడాది అది 76.8 శాతానికి పెరిగిందన్నారు. వయోజనుల్లో అజిత్రోమైసిన్ వాడకం గత ఏడాది 5.9 శాతానికి చేరుకుందని చెప్పారు. అది 2018లో కేవలం 4 శాతం కాగా 2019లో 4.5 శాతంగా ఉందని పేర్కొన్నారు. శ్వాసకోశ ఇన్ఫేక్షన్లపై ఉపయోగించే డాక్సీసైక్లిన్, ఫారోపెనమ్ ఔషధాల వినియోగమూ గత ఏడాది పెరిగినట్లు చెప్పారు. అమెరికా సహా పలు ఇతర అధిక ఆదాయ దేశాల్లో మాత్రం మహమ్మారి వేళ యాంటీబయోటిక్ డోసుల విక్రయాలు గణనీయంగా తగ్గాయని తెలిపారు. కరోనా నియంత్రణ ఆంక్షల నేపథ్యంలో భారత్లో గత ఏడాది మలేరియా, డెంగీ, గన్యా తదితర వ్యాధుల బారిన పడ్డవారి సంఖ్య తగ్గిందని వెల్లడించారు. కాబట్టి వాస్తవానికి యాంటీబయోటిక్ల వినియోగం తగ్గాల్సి ఉన్నా.. కొవిడ్ నేపథ్యంలో ప్రజలు వాటిని ఎక్కువగా ఉపయోగించారని పేర్కొన్నారు. భారత్లో కొవిడ్ బారిన పడ్డవారిలో దాదాపుగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక యాంటీబయోటిక్ ఔషధాన్ని తీసుకున్నట్లు తమ అధ్యయనం ద్వారా తెలుస్తోందని పరిశోధకులు చెప్పారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లపై అవి సమర్థంగా పనిచేయవన్న సంగతిని గుర్తించాలని సూచించారు. వాటికి అతిగా వినియోగిస్తే.. ఔషధ నిరోధక వ్యాధుల ముప్పు పెరుగుతుందని హెచ్చరించారు.