సెక్స్ గురించి బయటికి మాట్లాడడాన్నే ఓ కళంకంగా భావిస్తుంది మన సమాజం. అలాంటిది లైంగిక విద్యను అందరికీ పంచుతానంటే ఊరుకుంటుందా? అసలు ఈ అమ్మాయే అందరినీ తప్పుదోవ పట్టిస్తోందని నిందలేస్తుంది. తన కెరీర్‌ని ఎంచుకున్నప్పుడు ఇలాంటి ఎన్నో అపనిందల్ని మోశానని చెబుతోంది పల్లవి. ఝార్ఖండ్‌లోని బొరాకో స్టీల్ సిటీలో పుట్టి పెరిగిన తను.. చిన్నతనం నుంచి అమ్మానాన్నల మధ్య జరిగే గొడవల్ని చూస్తూ పెరిగింది. అయితే తన వైవాహిక జీవితంలోనూ ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఎవరేమనుకున్నా, ఈ సమాజం తనను చెడుగా చూసినా.. తాను చేసే పని నలుగురికీ ఉపయోగపడితే చాలంటోన్న పల్లవి.. తన ప్రస్థానం గురించి ఇలా చెప్పుకొచ్చింది.
పెళ్లి కలిసి రాలేదు!
ఎంబీయే పూర్తయ్యాక దిల్లీలోని ఓ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగమొచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకే పెళ్లైపోయింది. కానీ ఈ వివాహ బంధం నా జీవితంలో ఎన్నో చేదు అనుభవాలను మిగిల్చింది. ఈ క్రమంలో ఇంటి బాధ్యతల దగ్గర్నుంచి సంపాదన దాకా .. ఇలా ప్రతిదీ నామీదే భారం పడింది. దీనికి తోడు పురుషాధిపత్యం అంటే ఏంటో పెళ్లయ్యాకే నాకు అవగతమైంది. అయినా ఆడవాళ్లే అన్ని పనులు ఎందుకు చేయాలి? ఒకవేళ చేసినా అమ్మాయిల్నే ఈ సమాజం ఎందుకు తప్పు పడుతుంది? పైగా నెలసరి, లోదుస్తులు, శృంగారం.. ఈ విషయాల గురించి మాట్లాడితే బరితెగించిందన్న ముద్ర పడిపోతుంది? ఇలా నా మనసులో ఎన్నో ప్రశ్నలు వేధించాయి. ఇదే సమయంలో నేను కాలేజీలో చదువుతున్నప్పుడు నా స్నేహితుల ప్రేమకథలు, వాళ్ల రిలేషన్‌షిప్స్ గురించిన జ్ఞాపకాలు నా మదిలో మెదిలాయి. అయినా శృంగారం గురించి తెలుసుకోవాలని అందరూ ఆరాటపడుతుంటారు.. కానీ దాని గురించి నలుగురిలో మాట్లాడాలంటే మాత్రం భయం, బిడియం.. ఎందుకిలా? ఈ ఆలోచనలు, అనుభవాలే.. లైంగిక విద్య గురించి అవగాహన కల్పించాలన్న ఆలోచనను నా మనసులో రేకెత్తించాయి.
దాని ముఖ్యోద్దేశమదే!
పెళ్లి బంధం అచ్చి రాక మూడేళ్లకే నా భర్త నుంచి విడాకులు తీసుకున్నా. ఈ క్రమంలో నచ్చని బంధం నుంచి బయటికొచ్చిందని చులకనగా చూశారే తప్ప.. అసలు ఇలా జరగడానికి కారణమేంటని ఏ ఒక్కరూ ఆలోచించలేదు. అయినా ఆ విమర్శలన్నీ తట్టుకొని ముందుకు సాగా. లైంగిక విద్యపై అవగాహన కల్పించాలన్న ఒకే ఒక్క ఆలోచనతో 2018లో TARSHI (Talking About Reproductive and Sexual Health Issues) అనే దిల్లీకి చెందిన ఎన్జీవో నుంచి సెక్సువాలిటీ ఎడ్యుకేషన్ కోర్సు పూర్తి చేశా. ఆ తర్వాత RedWomb (getintimacy.com) పేరుతో ఓ ఆన్‌లైన్ వేదికను ప్రారంభించా. శృంగారం, దాని వల్ల పొందే ఆనందాన్ని, అనుభవాల్ని వివరంగా చర్చిస్తూ; ఈ అంశాలకు సంబంధించి శాస్త్రీయమైన అవగాహన కల్పించే వేదికే ఇది. అనుబంధాల్లో కలతల్ని తొలగించి ప్రేమను, ఆనందాన్ని పెంచే ముఖ్యోద్దేశంతోనే ముందుకు సాగుతున్నా. ఎందుకంటే శృంగారం అనేది శరీరానికి సంబంధించిందే కాదు.. మనసునూ ఉత్తేజపరుస్తుంది.. దంపతుల మధ్య అనుబంధాన్ని పెంచుతుంది.
అంతేకాదు.. లైంగిక విద్య గురించి అవగాహన పెంచే క్రమంలో పలు కార్యక్రమాలు, డ్రైవ్స్ నిర్వహిస్తున్నా.. లైంగికంగా ఎదురయ్యే పలు సమస్యలు, అపోహలకు నిపుణుల ద్వారా పరిష్కార మార్గం చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఈ దిశగా అవగాహన కల్పిస్తోన్న పలు కంపెనీలతో కలిసి పనిచేస్తున్నా.. సందర్భం వచ్చినప్పుడల్లా దీని గురించి టెడెక్స్(TedEx) వేదికలపైనా గళాన్ని వినిపిస్తున్నా. ఆర్టికల్స్, బ్లాగ్స్ రాయడం నాకు ముందు నుంచీ అలవాటుంది.. ఈ నేపథ్యంలో లైంగిక పరమైన అంశాలకు సంబంధించిన వ్యాసాలు సైతం రాస్తున్నా. అలాగే పలు పుస్తకాలు కూడా రాశా.