తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోటీ చేయకుండా 15 ఏళ్లుగా సీఎం- ఎలా సాధ్యం?

ఒకప్పుడు బిహార్‌ అంటే బీమారీ రాష్ట్రం... అరాచకానికి, అవినీతికి మారు పేరు! అధ్వాన శాంతిభద్రతలకు కేరాఫ్‌ అడ్రస్‌! అలా సాగుతున్న బిహార్‌ను తన సరికొత్త రాజకీయ సామాజిక సమీకరణాల ద్వారా లాలూ ప్రసాద్‌ యాదవ్‌ గుప్పిట నుంచి తప్పించి... అభివృద్ధి దిశగా సరికొత్త దారి పట్టించారు నితీశ్‌ కుమార్! ఏ నియోజకవర్గం నుంచీ పోటీ చేయకుండా 15 సంవత్సరాలుగా బిహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన నితీశ్‌... తనదైన శైలిలో బిహార్​ను పాలించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నితీశ్​పై ప్రత్యేక కథనం.

A special story on  Bihar CM Nitish Kumar in view of recent election results
పోటీ చేయకుండా 15ఏళ్ల బిహార్​ పాలన- ఎలా సాధ్యం?

By

Published : Nov 11, 2020, 9:53 AM IST

బిహార్‌ ఎన్నికల ఫలితాలొచ్చాయ్‌! మరి ముఖ్యమంత్రి నితీశ్‌ ఏ స్థానంలో ఎంత మెజారిటీతో గెలిచారో ఎవరైనా చెప్పగలరా? కష్టమే. ఇప్పుడే కాదు... గత ఎన్నికల్లోనూ, అంతకుముందు కూడా ఆయన ఏ నియోజకవర్గం నుంచి గెలిచారో చెప్పలేరు! ఎందుకంటే ఆయన పోటీ చేయలేదు కాబట్టి.. లాలూ ప్రసాద్‌ లాంటి మహామహుడి సారథ్యంలోని సామ్రాజ్యాన్ని కూల్చి... బిహార్‌లో తన పార్టీ జనతాదళ్‌ను అప్రతిహతంగా అధికారంలో ఉంచుతూ... 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన నితీశ్‌కుమార్‌... 1985 (స్వతంత్య్ర అభ్యర్థిగా) తర్వాత ఇంతదాకా బిహార్‌ అసెంబ్లీకి ఎన్నిక కాలేదంటే ఆశ్చర్యపోక తప్పదు! శాసనసభ (ఎమ్మెల్యే) కాకుండా... శాసనమండలి సభ్యుడి (ఎమ్మెల్సీ)గానే రాష్ట్రంలో తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తుండటం నితీశ్‌ విలక్షణత!

కమలంతో కలసినా... కాషాయం అంటకుండా...

సోషలిస్టు నేత అలనాటి జయప్రకాశ్‌ నారాయణ్‌ (జేపీ) స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన నితీశ్‌కుమార్,‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌, శరద్‌యాదవ్‌, పాశ్వాన్ ‌లాంటివారితో కలసి సామ్యవాద భావజాలంతో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. చాలాకాలం జార్జిఫెర్నాండెజ్‌లాంటి వారి నీడలో ఉండిపోయారు. కానీ క్రమంగా... వారి నుంచి విడిపోయి... తనదైన రాజకీయ పంథాను ఎంచుకున్నారు. జయప్రకాశ్‌ నారాయణ్‌ సారథ్యంలో రాజకీయాల్లోకి వచ్చినా... భాజపా పూర్వ సిద్ధాంతకర్త గోవీందాచార్యతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఆయన ప్రభావంతో భాజపా, ఆరెస్సెస్‌ సిద్ధాంతాలన్నీ చదివారంటారు! గమ్మత్తేమంటే- చాలాకాలంగా భాజపాతో పొత్తులో కొనసాగుతూనే...వాజ్‌పేయీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా... కాషాయం రంగు అంటించుకోకపోవటం.. సెక్యులర్‌ ముద్ర కోల్పోకపోవటం నితీశ్‌ చాణక్యనీతికి నిదర్శనం!

అందుకే అసెంబ్లీకి దూరం...

1977 అసెంబ్లీ ఎన్నికల్లో నలందా జిల్లాలోని హర్నాట్‌ నుంచి పోటీచేసిన ఆయన ప్రజామోదాన్ని పొందలేకపోయారు. తరవాత అదే నియోజకవర్గం నుంచి 1985లో విజేతగా నిలిచారు. ఆ తరవాత 1989, 1991, 1996, 1998, 1999, 2004లో పార్లమెంటుకు నెగ్గిన ఆయన, అసెంబ్లీలో అడుగు పెట్టే ఆలోచన ఏనాడూ చేయలేదు. ఎంపీగా కేంద్రంలో రైల్వే, వ్యవసాయం వంటి కీలక శాఖలను నిభాయించారు. మధ్యలో కేంద్ర రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటికీ శాసనసభ ఎన్నికల్లో పోటీచేయాలనే ఆలోచన చేయలేదు. "రాజ్యాంగ రీత్యా ఎగువసభకు గౌరవం ఎక్కువ. ఇక ఎన్నికల సమయంలో పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా అనేక బాధ్యతల్లో తలమునకలవ్వాల్సి వస్తుంది. పార్టీని సమన్వయ పరిచి ముందుండి నడిపించాల్సి ఉంటుంది. అందువల్లే ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నాను తప్ప ప్రజాబలం లేక కాదు" అనేది నితీశ్‌ వివరణ!

బిహార్‌ విప్లవకారుడు...

ఒకప్పుడు బిహార్‌ అంటే బీమారీ రాష్ట్రం... అరాచకానికి, అవినీతికి మారు పేరు! అధ్వాన శాంతిభద్రతలకు కేరాఫ్‌ అడ్రస్‌! అలా సాగుతున్న బిహార్‌ను తన సరికొత్త రాజకీయ సామాజిక సమీకరణాల ద్వారా... లాలూ ప్రసాద్‌ యాదవ్‌ గుప్పిటి నుంచి తప్పించి... అభివృద్ధి దిశగా సరికొత్త దారి పట్టించారు నితీశ్‌! లాలూను పెద్దన్నగా పిలిచే నితీశ్‌- యాదవ్‌-ముస్లింల ఓటు బ్యాంకు గండికొట్టి లాలూ సామాజ్య్రాన్ని కూల్చేశారు. మహాదళితులు, ఓబీసీల్లోని వెనకబడిన వర్గాలవారి కూటమితో కలసి సరికొత్త సామాజిక సమీకరణంతో లాలూను దెబ్బతీసిన చాణక్యుడు నితీశ్‌. అంతేగాకుండా వెనకబడిన తరగతుల్లోని నిమ్నవర్గాలకు పెద్దపీట వేసిన ఘనత కూడా నితీశ్‌దే! అన్నింటికి మించి... మహిళలకు మాటిచ్చి... రాష్ట్రంలో మద్యనిషేధం పూర్తిగా అమలు చేస్తున్నారు. లక్షమంది టీచర్లను నియమించటం... సైకిళ్లిచ్చి అమ్మాయిలు బడులకు వచ్చేలా ప్రోత్సహించటం... తద్వారా సామాజిక మార్పునకు నాందిపలికిన రాజకీయ విప్లవకారుడు!

శాస్త్రి బాటలో...

రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసిన రైల్వే మంత్రిగా లాల్‌ బహదూర్‌ శాస్త్రి గురించి ఇప్పటికీ చెప్పుకుంటాం. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ సైతం ఇదే బాటలో నడిచారు. అందుకే 1999లో అసోంలోని గైసాల్‌ రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ తక్షణం రాజీనామా చేశారు.

సుదీర్ఘ సీఎంగా...

బిహార్‌ తొలి ముఖ్యమంత్రి శ్రీకృష్ణ సిన్హా దాదాపు పదిహేను సంవత్సరాల పాటు రాష్ట్రానికి సారథ్యం వహించారు. నితీశ్‌ కుమార్‌ కూడా సిన్హా రికార్డుకు చేరువలో ఉన్నారు ప్రస్తుత ఎన్నికల్లో విజయం సాధించి, ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తే ఈ రికార్డును తేలిగ్గా అధిగమించగలరు.

  • పేరు: నితీశ్‌ కుమార్‌
  • ముద్దుపేరు: మున్నా, సుశాసన్‌ బాబు
  • వయసు: 69 ఏళ్లు
  • చదువు: బీఎస్సీ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌
  • సొంతూరు: భక్తియార్‌పూర్‌, బిహార్‌
  • కుటుంబం: భార్య మంజు కుమారి సిన్హా మరణించారు (చివరి దాకా ఆమె టీచర్‌గా పనిచేశారు).

కొడుకు నిశాంత్‌కుమార్‌. బిట్స్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ చేశారు. తనకు రాజకీయాలంటే ఇష్టం లేదు. ఆధ్యాత్మిక జీవితం గడపాలని కోరుకుంటుంటారు. రాజకీయాల్లోకి రాకముందు కొద్దికాలం పాటు బిహార్‌ విద్యుత్‌ బోర్డులో పనిచేశారు.

ఇదీ చూడండి:సీట్లు పెరిగినా భాజపాకు ఓట్లు మాత్రం తగ్గాయ్​!

ABOUT THE AUTHOR

...view details