Son Helicopter Ride Gift Mother: రాజస్థాన్ అజ్మేర్లో ఓ తల్లికి కుమారుడు ఇచ్చిన కానుక నెటిజన్ల చేత వావ్ అనిపించింది. 33 ఏళ్ల పాటు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోసిన తల్లికి హెలికాప్టర్ రైడ్‌ను కుమారుడు గిఫ్ట్‌గా ఇచ్చాడు. రిటైర్మెంట్ సందర్భంగా తల్లిని హెలికాప్టర్లో తిప్పాడు.
అజ్మేర్లోని తోప్బ్రా ప్రాంతంలో నివసించే సుశీలా చౌహాన్.. కేసర్‌పురా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తున్నారు. 33 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించిన ఆమె శనివారం పదవీ విరమణ పొందారు. ఈ వేడుక కోసం అమెరికాలో ఉంటున్న తన కొడుకు యోగేశ్ చౌహాన్.. స్వగ్రామానికి చేరుకున్నాడు. తల్లి పదవీవిరమణ రోజు అదిరిపోయే కానుక ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. శనివారం.. సుశీలా చౌహాన్ పదవీ విరమణ కార్యక్రమం పూర్తయ్యాక ఆమెను హెలికాప్టర్లో తోప్బ్రా గ్రామానికి తీసుకెళ్లాడు కుమారుడు. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. గ్రామంలోకి హెలికాప్టర్ రాగానే ప్రజలంతా అక్కడికి చేరుకున్నారు. ప్రశంసలతో యోగేశ్‌ను ముంచెత్తారు.
"నేను అమెరికాలో ఉంటున్నాను. అమ్మ పదవీవిరమణ కార్యక్రమం ఉందని తెలిసి నాలుగు రోజులు క్రితం.. ఊరికి వచ్చాను. అయితే రెండేళ్ల క్రితం నా భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నా కుమార్తె భారత్‌కు వచ్చిన మొదటి సారి.. కిషన్‌గఢ్ ఎయిర్పోర్ట్ నుంచి తోప్బ్రా ప్రాంతానికి హెలికాప్టర్లో తీసుకురావలనేది అమ్మ కోరిక. కానీ అది కొన్ని కారణాలతో కుదరలేదు. అందుకే అమ్మకు సర్ఫ్రైజ్ ఇస్తూ.. కేసర్‌పురా నుంచి తోప్బ్రా ప్రాంతానికి హెలికాప్టర్లో తీసుకొచ్చాను."