ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ గ్రామంలో ప్రభుత్వం పంచిన ఎల్ఈడీ బల్బులో సిమ్‌కార్డు బయటపడటం కలకలం సృష్టించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ బల్బును స్వాధీనం చేసుకున్నారు.
బయటపడిందిలా..
కౌసాంబి అనే ఊరిలో ప్రభుత్వం ఎల్ఈడీ బల్బులను సబ్సిడీ ధరకు పంపిణీ చేస్తోంది. ఈ సెంటర్ నుంచి బల్బు కొన్న అనికేత్ కేశర్వాణి అనే వ్యక్తికి మరో రెండు బల్బులను ఉచితంగా అందించారు నిర్వహకులు. అయితే అందులో ఒకటి పనిచేయట్లేదని గుర్తించిన ఆ వ్యక్తి దానిని తెరచి చూశాడు. అందులో సిమ్ కార్డు ఉండటం చూసి కంగారుపడ్డాడు. ఈ వార్త ఆ నోటా ఈ నోటా చేరి ఊరంతా వ్యాపించడం వల్ల గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ బల్బును స్వాధీనం చేసుకున్నారు.
"నేను ఒక నెల క్రితం ఒక క్యాంప్ నుంచి బల్బులు కొన్నా. ఆ తర్వాత అక్టోబర్ 7న 'గ్రామ్ ఉజాలా యోజన' కింద నేను రెండు ఎల్ఈడీ బల్బులు, ఓ హోల్డర్ గెలిచానని ఫోన్ వచ్చింది. నా అడ్రస్ అడిగి ఇద్దరు యువకులు వచ్చారు. ఒక కాగితం ఇచ్చి దాన్ని పూర్తి చేయమన్నారు. హోల్డర్‌తో పాటు రెండు ఎల్ఈడీ బల్బులు ఉచితంగా ఇచ్చారు. వారి వద్ద మరింత మంది లబ్ధిదారుల జాబితా ఉంది."
-అనికేత్ కేశర్వాణి, బల్బు కొన్న వ్యక్తి