మహారాష్ట్ర నాందేడ్ జిల్లాకు చెందిన ధ్యానేశ్వర్ ఉమాజీరావ్ కల్యాంకర్ అనే 30 ఏళ్ల రైతు విద్యుత్ బైక్‌ను రూపొందించాడు. కేవలం రూ.14 ఖర్చుతో 100 కిలోమీటర్లు ప్రయాణం చేసేలా దీన్ని తయారు చేశాడు. పింపలగాన్ మహాదేవ్ సమీపంలోని అర్థాపుర్ గ్రామానికి చెందిన ఈ రైతు.. తనకున్న కొద్దిపాటి భూమిలోనే సోదరునితో కలిసి వివిధ రకాల పూల మెుక్కలు సాగు చేస్తాడు. వీటిని మార్కెట్‌కి రవాణా చేయడానికి రోజుకు రూ.250 ఖర్చు అయ్యేది. దీంతో ఖర్చు తగ్గించుకునేందుకు వినూత్న ఆలోచన చేసి ఎలక్ట్రిక్ బైక్‌ను తీర్చిదిద్దాడు.
లాక్డౌన్ సమయంలో రెండు సంవత్సరాలు కష్టపడి ఈ విద్యుత్ బైకును తయారుచేశాడు ధ్యానేశ్వర్. దీనిపై సుమారు 300 కేజీల బరువును తీసుకెళ్లవచ్చు. ఈ ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీకి రూ.26,000 అవుతుంది. 750 వోల్ట్ కెపాసిటీ గల మోటార్, 48 వోల్ట్ బ్యాటరీ, ఛార్జర్, కంట్రోలర్, లైట్, ఎలక్ట్రిక్ బ్రేక్ ఉంటాయి. కేవలం 4 గంటలు ఛార్జింగ్ పెడితే 100 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. దీనికి రూ.14 మాత్రమే ఖర్చు అవుతుంది.