అదిరే ఫీచర్లతో సూపర్ ఈ- బైక్ 'ప్రాణ' బైక్లు అంటే కుర్రకారుకు మాములు మజా కాదు. కానీ అవి ఉత్పత్తి చేసే విషవాయువులు పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. ఇందుకోసం ఈ సమస్యకు చెక్ పెడుతూ కోయంబత్తూరుకు చెందిన శ్రీవరు మోటార్స్ ప్రైవేటు లిమిటెడ్ ఎలక్ట్రిక్ బైక్ను రూపొందించింది. 'ప్రాణ' పేరుతో మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఈ-బైక్కు ఎన్నో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి.
'ప్రాణ' సురక్షితమైన ఎలక్ట్రిక్ బైక్ అని శ్రీవరు మోటార్స్ ఇంజనీర్ మోహన్ పెరియస్వామి అన్నారు. ఈ బైక్ వాహనరంగంలో కొత్త శకానికి నాంది పలుకుతుందన్నారు.
"ఇందులో టెలీస్కోపిక్ సస్పెన్షన్ ఉండటం వల్ల వాహనం నడుపుతున్నప్పుడు ఎలాంటి అదురు ఉండదు. ఈ బైక్కు క్లచ్ లేకపోవడం వల్ల వినియోగదారుల ప్రయాణం సులభం అవుతుంది. ఇది ఎలాంటి విషవాయువులను విడుదల చేయదు. 10 మొక్కలు నాటినట్లు కొనుగోలుదారులు చిత్రాలు చూపిస్తే వారికి 25వేలు డిస్కౌంట్ ఇస్తాం."
-మోహన్ పెరియస్వామి, శ్రీవరు మోటార్స్ ఇంజనీర్
4 నిమిషాల్లో 60 కి.మీ. వేగం..
వైవిధ్యమైన ఫీచర్లతో ఉన్న ఈ బైక్ కుర్రకారును ఆకట్టుకుంటోంది. 160 కిలోల బరువు ఉండే ఈ బైక్ ఒక్క సారి ఛార్జ్ చేస్తే 126 కిలోమీటర్లు వెళుతుంది. డిజిటల్ డిస్ప్లే గల ఈ ద్విచక్రవాహనం అత్యధికంగా గంటకు 123 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. అంతే కాదు, స్టార్ట్ చేసిన నాలుగు నిమిషాలకే 60 కిలోమీటర్ల వేగం అందుకోగలదు. ఇందులో రివర్స్ మోడ్, రేస్ మోడ్లు ఉండటం విశేషం. రేస్మోడ్లో గంటకు 123 కిమీ, రివర్స్ మోడ్లో గంటకు అత్యధికంగా 5 కిలోమీటర్లతో వెళ్లవచ్చు. రూ. 2.25 లక్షలు ఖరీదు ఉన్న ఈ బండి మిస్టరీ బ్లాక్, ప్యాషనేట్ రెడ్, ప్రోగ్రెసివ్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. ఆధునిక ఫీచర్లతో స్పోర్ట్స్ బైక్కు దీటుగా 'ప్రాణ' దూసుకెళ్తోందని వినియోగదారులు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి :'తేజస్' ఎక్కిన ఎంపీ తేజస్వీ సూర్య